మయన్మార్ నకిలీ జాబ్‌ రాకెట్‌ లో చిక్కుకున్న తమిళులకు ఉపశమనం

నకిలీ జాబ్‌ రాకెట్‌ ఉచ్చులో పడి మయన్మార్‌లో చిక్కుకున్న మరో 13 మంది భారతీయులను ఎంబసీ అధికారులు కాపాడారు. వారంతా బుధవారం తమిళనాడుకు చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. గత నెలలో కూడా 32 మంది భారతీయులను రక్షించినట్లు చెప్పారు.

 మయన్మార్‌, థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీలు దీనికి ఎంతగానో కృషి చేశాయని చెప్పారు. కాగా, మయన్మార్‌, థాయ్‌లాండ్‌ సరిహద్దు ప్రాంతమైన మైవాడిలో చాలా భాగం రెబల్‌ గ్రూప్‌ నియంత్రణలో ఉంది. అయితే ఐటీ ఉద్యోగాల పేరుతో కొందరు భారతీయులను నకిలీ రాకెట్‌ ఉచ్చుపన్నింది.

ఈ నేపథ్యంలో తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినందుకు నకిలీ ఐటీ ఉద్యోగాలు పొందిన భారతీయులను మయన్మార్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.  మయన్మార్‌, థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీల సహకారంతో మైవాడి ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.

లావోస్, కంబోడియాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని చెప్పారు.  వారిని రక్షించి దేశానికి రప్పించేందుకు వియంటైన్, నమ్ పెన్, బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయాలు సహకరిస్తున్నాయని వెల్లడించారు. ఈ నకిలీ జాబ్‌ రాకెట్‌ గురించి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.