జమ్మూ కాశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజన సవాల్ సాధ్యం కాదు

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఆర్డర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, జమ్మూ కాశ్మీర్‌ స్పష్టం చేశాయి. మరోవైపు పునర్విభజనకు సంబంధించి కమిషన్‌ ఏర్పాటు, పరిధి, పదవీకాలం, అధికారాలు అమలు చేస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసిన నేపథ్యంలో దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను సవాల్‌ చేస్తూ హజీ అబ్దుల్‌ గని ఖాన్‌, మహమూద్‌ ఆయూబ్‌ మట్టూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్‌, ఇసిఐ కౌంటరు అఫిడవిట్‌ చేశాయి. అయితే ఇదే కేసుతో ఎపి, తెలంగాణ అసెంబ్లీ సీట్లు పెంపునకు సంబంధించి ఎపి విభజన చట్టం అమలు చేయాలని ప్రొఫెసర్ కె పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జత చేసిన విషయం విదితమే.

నియోజకవర్గాల పునర్విభజనపై కమిషన్‌ ఏర్పాటై రెండేళ్లు గడిచిందని కేంద్రం తరపున హోంశాఖ, జమ్మూ కాశ్మీర్‌ (యుటి) గుర్తుచేశాయి. కమిషన్‌ తన పని పూర్తి చేసిందని, ఆదేశాలు కూడా గెజిట్‌ విడుదల చేశామని పేర్కొన్నాయి. పిటిషనర్లు సకాలంలో పిటిషన్ దాఖలు చేయడంలో విఫలమయ్యారని తెలిపాయి. 

నియోజకవర్గాల పునర్విభజనపై ఏర్పాటైన కమిషన్‌ గెజిట్‌లో ప్రచురణ తర్వాత డిలిమిటేషన్‌ చట్టం, 2002లోని సెక్షన్‌ 10(2) ప్రకారం సవాల్‌ చేయడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. మేఘరాజ్‌ కొఠారి వర్సెస్‌ డిలిమిటేషన్‌ కమిషన్‌ కేసులో ఈ సెక్షన్‌ను ఇప్పటికే కోర్టు సమర్థించిందని గుర్తు చేసింది. పిటిషన్లు అనుమతిస్తే గెజిట్‌ నిష్ఫలం అవుతుందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 329ని ఉల్లంఘించడమేనని తెలిపింది. 

జమ్మూ కాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 2019పై అవగాహన లేకుండా పిటిషనర్లు కోర్టును ఆశ్రయించినట్లు ఉన్నారని తెలిపింది. చట్టంలోని సెక్షన్‌ 62 ప్రకారం కమిషన్‌ ఏర్పాటు చేసినందున ప్రత్యేకించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం పేర్కొందని తెలిపింది. 

డిలిమిటేషన్‌ రాజ్యాంగ ఆదేశాలు, పరిధి, పదవీకాలాలకు సంబంధించిన అధికారాలు అమలు చేస్తూ కేంద్రం ఆమోదించిన విషయాన్ని గుర్తుచేసిన కేంద్ర ఎన్నికల సంఘం దీంట్లో వాఖ్యానించదలచుకోలేదని పేర్కొంది. కాగా, 2011 జనాభా లెక్కలు అనుసరించి జమ్ముకాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేపడుతున్నారని, 2011లో జమ్మూ కాశ్మీర్‌లో ఎలాంటి జనాభా లెక్కల సేకరణ చేపట్టలేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు ఆరోపించారు. 

జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు 107 నుంచి 114కు పెంచడం ఆర్టికల్‌ 81, 82, 170, 330, 332లతోపాటు జమ్ము కాశ్మీర్‌ పునర్విభజన చట్టం, 2019లోని సెక్షన్‌ 63కు వ్యతిరేకమని పేర్కొన్నారు. జనాభాకు అనుగుణంగా లేని మార్పులు కూడా కేంద్రపాలిత చట్టంలోని సెక్షన్‌ 39ని ఉల్లంఘించడమేనని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.