తమిళనాడులో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి 

తమిళనాడులో నవంబర్‌ 6న ఆర్‌ఎస్ఎస్‌ సంస్థ ర్యాలీ నిర్వహించేందుకు అనుమతించాలంటూ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం  ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వం అనుమతివ్వకుంటే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 
 
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న రాష్ట్రంలోని 50 నగరాల్లో ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీలు జరపాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో పోలీసుల అనుమతి కోరుతూ ఆర్‌ఎ్‌సఎస్‌ నిర్వాహకులు వినతి పత్రాలు సమర్పించారు. అయితే పోలీసులు  ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో ఆ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 
 
హైకోర్టు విచారణ జరిపి కొన్ని షరతులతో అక్టోబర్‌ 2న ర్యాలీ చేసేందుకు ఆర్‌ఎస్ఎస్‌ కు అనుమతి మంజూరు చేసింది.  అయినా,కోర్ట్ ఉత్తరువులను పట్టించుకోకుండా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు నిషేధం విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎస్ఎస్‌ ర్యాలీకి అనుమతిని నిరాకరించింది. 
 
దీనిని సవాలు చేస్తూ ఆర్‌ఎస్ఎస్‌  రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను ఉల్లఘిస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఆర్‌ఎస్ఎస్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నవంబర్‌ 6న ఆ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీ చేసుకునేందుకు పోలీసు శాఖ అనుమతివ్వాలని ఆదేశించింది. 
హైకోర్టు ఆదేశించినప్పటికీ, అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా రూట్ మార్చ్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరింరని పేర్కొంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు దాఖలు చేసిన 30 కోర్టు ధిక్కార పిటిషన్లపై స్పందించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది.  పిటిషనర్ల సీనియర్ న్యాయవాది ఎస్ ప్రభాకరన్ వాదిస్తూ సెప్టెంబర్ 22న జస్టిస్ ఇళంతిరాయన్ సహేతుకమైన ఆంక్షలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారని తెలిపారు. అయితే పోలీసులు వారి దరఖాస్తును తిరస్కరించారు. 
 
పీఎఫ్‌ఐ నిషేధం కారణంగా తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, ఆ తర్వాత రాష్ట్రంలోని రాజ్యాంగ యంత్రాంగం మొత్తం విచ్ఛిన్నమైందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదా అని న్యాయమూర్తి ప్రశ్నించగా  రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఆ మేరకు కేంద్ర నిఘాసంస్థల నుండి కూడా తమకు సమాచారం వచ్చినదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. 
 
ఈ ఉత్తర్వులు అమలు చేయకుండా ర్యాలీకి అనుమతి నిరాకరిస్తే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కింద ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన పిటిషన్‌పై తదుపరి విచారణ అక్టోబర్‌ 31కి వాయిదా వేసింది.