ఎల్‌జీని కించపరిచే పోస్టులు ఆప్ తొలగించాల్సిందే

ఎల్‌జీని కించపరిచే పోస్టులు ఆప్ తొలగించాల్సిందే

ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీ నేతలు పలువురు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా వేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. ఎల్‌జీపై ఆరోపణల విషయంలో సంయమనం పాటించాలని ఆప్ నేతలను ఆదేశించింది.

ఆయనను కించపరిచే పోస్టులు, వీడియోలు ట్వీట్లను సోషల్ మీడియా నుంచి వెంటనే తొలగించాలని జస్టిస్ అమిత్ బన్సాల్ ఆదేశించారు. ఆప్‌కు చెందిన అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాథక్, జాస్మిన్ షాలపై సక్సేనా పరువు నష్టం కేసు వేశారు.  తనపై సోషల్ మీడియాలో చేసిన తప్పుడు, అవమానకరమైన పోస్టులు, ట్వీట్లు, వీడియోలను తొలగించాలని సక్సేనా కోర్టును కోరారు. ఆప్ నేతలు ఐదుగురు తనకు రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కూడా ఎల్జీ డిమాండ్ చేశారు.

సక్సేనా 2010లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో రూ. 1400 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టు ఆప్ నేతలు ఆరోపించారు. దీనిపై ఎల్‌జీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రణాళికాబద్ధమైన ఉద్దేశంతో చట్టాన్ని అమలు చేసే సంస్థలు తీసుకునే చర్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆప్ ఈ ఆరోపణలు చేసిందని కోర్టుకు తెలిపారు.

సక్సేనా ఖాదీ కమిషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఆయన కుమార్తెకు ఖాదీ కాంట్రాక్ట్ ఇచ్చారనేది ఆప్ నేతల ఆరోపణల్లో ఒకటిగా ఉంది. దీనిపై ఆప్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఇది నిజమని, ఎవరూ కాదనలేని సత్యమని పేర్కొన్నారు.  దీనిపై సక్సేనా న్యాయవాది మాట్లాడుతూ నిజానికి ప్రో బోనో బేసిన్‌లో ఖాదీ లాంజ్ డిజైనింగ్‌కు సక్సేనా కుమార్తె సహకరించారని, తన సేవలకు ఒక్క పైసా కూడా తీసుకోలేదని కోర్టుకు వివరించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ డబ్బులు తీసుకోనప్పుడు ఇది అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు.