మాజీ న‌టి ఆషా ప‌రేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

మాజీ న‌టి ఆషా ప‌రేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది. ఆషా ప‌రేఖ్ 95 చిత్రాల్లో న‌టించారు. దిల్ దేకే దేకో, క‌టీ ప‌తంగ్‌, తీస్రీ మంజిల్‌, బ‌హారోంకే స‌ప్నే, ప్యార్ కా మౌస‌మ్‌, కార‌వాన్ లాంటి హిట్ చిత్రాల్లో ఆమె న‌టించారు. 1952లో రిలీజైన ఆస్మాన్ చిత్రంలో ఆమె బాల‌న‌టిగా చేశారు. కథానాయికగా దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, రాజేష్ ఖన్నా వంటి నటులతో తెరను పంచుకున్నారు.
 
ఆ త‌ర్వాత రెండేళ్ల‌కు బాప్ బేటి చిత్రంలో న‌టించింది. ఘోరా కాగ‌జ్ టీ.వీ షోలో ఆమె పాత్ర‌ను పోషించారు. 1950-60 మధ్య అగ్రశ్రేణి నటీమణుల్లో ఒకరిగా ఉన్నారు. ఆషా ప‌రేఖ్ 95 చిత్రాల్లో న‌టించారు.  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు క‌మిటీలోని అయిదుగురు స‌భ్యులు ఆషా ప‌రేఖ్ పేరును ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ క‌మిటీలో ఆషా భోంస్లే, హేమా మాలిని, పూన‌మ్ దిల్లాన్‌, ఉదిత్ నారాయ‌ణ్‌, టీఎస్ నాగాభ‌ర‌ణ ఉన్నారు.
 
2020 సంవ‌త్స‌రానికి గాను ఆమెకు ఈ అవార్డు ద‌క్కిన‌ట్లు కేంద్ర స‌మాచార‌శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భార‌తీయ చ‌ల‌న‌చిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బ‌హూక‌రించ‌నున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ఆషా ప‌రేఖ్ వ‌య‌సు 79 ఏళ్లు. శుక్ర‌వారం జ‌రిగే 68వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో ఆషాకు ఫాల్కే అవార్డును అంద‌జేయ‌నున్నారు.
1992లో  భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.  1998-2001 మధ్య సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం. గతంలో రాజ్ కపూర్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్,  ఏఎన్నార్,  వినోద్ ఖన్నా తదితరులు అందుకున్నారు. దేవికా రాణి మొదటి విజేత కాగా, రజనీకాంత్‌కు గతేడాది ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును  ప్రధానం చేశారు.