ప్రధాన మంత్రి కావాలన్న ఆశను నెరవేర్చుకోవడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్‌జెడి, కాంగ్రెస్‌తో చేతులు కలిపి బిజెపికి వెన్నుపోటు పొడిచారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. నితీష్ బిజెపి నుండి విడిపోయి ఆర్జేడీతో కలసి ప్రభుత్వం ఏర్పర్చిన తర్వాత మొదటిసారిగా బీహార్ లో పర్యటిస్తున్న ఆయన సరిహద్దు ప్రాంతమైన సీమాంచల్ లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూర్ణియాలో బిజెపి నిర్వహించిన `జనభావన మహాసభ’ ర్యాలీలో ప్రసంగిస్తూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భరోసా వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్‌కు ఎటువంటి సిద్ధాంతాలు లేవని, కులాధారిత రాజకీయాలకు అనుకూలంగా తన సోషలిజాన్ని ఆయన వదులుకున్నారని ఆరోపించారు.
2014లో కూడా నితీశ్ కుమార్ ఇదే పని చేశారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ కూటములు మార్చడం ద్వారా ప్రధాని కాగలరా? అని ఆయన నితీష్ కుమార్ ను ప్రశ్నించారు. ఎప్పుడు పొత్తులు మార్చే నితీష్ పట్ల జాగ్రత్తగా ఉండాలని లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా అమిత్ షా హెచ్చరించారు.
“ఇప్పుడు మీ (లాలూ) ఒడిలో కూర్చున్న నితీష్ రేపు కాంగ్రెస్ ఒడిలో కూర్చొనేందుకు సిద్దపడవచ్చు” అని స్పష్టం చేశారు. బీహార్ లో బిజెపికి మరింత ఊపునిచ్చేలా, రాష్ట్రాభివృద్ధికి తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ బీజేపీ బీహార్ యూనిట్ కొత్త నినాదంతో ముందుకు వచ్చింది. ‘‘ఆవో చలే భాజ్‌పా కే సాత్, కరే బీహార్ కా వికాశ్’’ (బీహార్ అభివృద్ధి కోసం బీజేపీకి మద్దతిద్దాం) అనే నినాదాన్ని ఆ పార్టీ ప్రవేశపెట్టింది.
“నితీష్ కుమార్‌కు ఎలాంటి సిద్ధాంతాలు లేవు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ‘మహాగట్ బంధన్’ తారుమారు అవుతుంది. 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిజెపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీహార్ సిఎంకు ఒకే ఒక లక్ష్యం ఉందని… అది తన గద్దె పదిలంగా ఉండాలన్నది’’ అని షా చెప్పుకొచ్చారు.
‘‘నితీష్ కుమార్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారు. నితీష్ కుమార్‌కి సీమాంచల్ తగిన బుద్ధి చెబుతుంది’’ అని భరోసా వ్యక్తం చేశారు. రాజకీయ పొత్తులు మార్చుకుని నితీశ్ ప్రధాని కాగలరా? అని అమిత్ షా ప్రశ్నించారు.2014లో నితీష్ కుమార్ కు రెండే రెండు లోక్ సభ సీట్లు ఉన్నాయని గుర్తు చేస్తూ, 2024లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ పార్టీలు పూర్తిగా తుడిచిపెట్టుకు పోతాయని ఆయన జోస్యం చెప్పారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ ప్రజలు మహాగట్బంధన్‌ను చిత్తుగా ఓడిస్తారని, 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము సేవ, అభివృద్ధితో కూడిన రాజకీయాలు చేస్తామే తప్ప స్వార్థపూరిత, అధికారం కోసం పాకులాడే రాజకీయాలు కాదని ఆయన స్పష్టం చేశారు. బీహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో తన రెండు రోజుల పర్యటనలో ఉన్న షా, ఎంపీలు, ఎమ్మెల్యేలు , పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
అక్రమ వలసదారులతో అమృత్సర్ కు మరో రెండు విమానాలు
భారతదేశ వారసులు హిందువులే