ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు ప్రధాన మీడియా ఛానెల్

ప్రధాన స్రవంతి మీడియాకు అతిపెద్ద ముప్పు కొత్త యుగం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కాదని, ప్రధాన స్రవంతి మీడియా ఛానెల్‌ లే అని  కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి  అనురాగ్ ఠాకూర్ తెలిపారు . వాస్తవాలను తెలపడం, సత్యాలను చూపించడం, అన్ని పక్షాలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి వేదికను అందించడమే నిజమైన జర్నలిజం అని ఆయన పేర్కొన్నారు.

ఆసియా-పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్‌కాస్టింగ్ డెవలప్‌మెంట్ (ఎఐబిడి) 47వ వార్షిక సమావేశం, 20వ సభలను ప్రారంభిస్తూ  విభజన వాదం,  తప్పుడు కథనాలను వ్యాప్తి చేసే అతిథులను ఆహ్వానించడం, వారి ఊపిరితిత్లు పగిలేట్టు కేకలు వేయడం ఛానెల్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని మంత్రి స్పష్టం చేశారు.  “అతిథి, స్వరం, దృశ్యాలకు సంబంధించి మీ నిర్ణయాలు, విశ్వసనీయమైన, పారదర్శకమైన వార్తలు ప్రేక్షకుల దృష్టిలో మీ ఛానల్ విశ్వసనీయతను నిర్వచిస్తాయి. మీ కార్యక్రమాన్ని చూడటానికి వీక్షకుడు ఒక్క నిమిషం ఆగిపోవచ్చు, కానీ మీ యాంకర్‌ను, మీ ఛానెల్నూ లేదా మీ బ్రాండ్‌ను ఎప్పటికీ విశ్వసించరు” అని ఆయన హెచ్చరించారు.

కథనాన్ని సౌండ్‌బైట్‌ల ద్వారా నిర్వచించ చూడవద్దని, అతిథులు, ఛానెల్‌  స్థాయిని పెంచే విధంగా మీరే  నిబంధనలను రూపొందించకొని, మీరే పునర్నిర్వచించండి అని మంత్రి ఈ సందర్భంగా హాజరైన ప్రసారదారులకు హితవు చెప్పారు. ప్రేక్షకులకు ఉత్తేజకరమైన ప్రశ్నలను సంధిస్తూ  “యువ ప్రేక్షకులు టీవీ వార్తల కార్యక్రమాలను మార్చుతున్నారా? లేదా పోటీలో ముందుండడానికి మీరు వార్తలలో నిస్పాక్షికతని, చర్చా కార్యక్రమాలలో వివేచనను తిరిగి తీసుకురాబోతున్నారా? ” అని మంత్రి ప్రశ్నించారు.

కరోనా మహమ్మారి సమయంలో సభ్య దేశాలను ఆన్‌లైన్‌లో సంధానం చేసి, మహమ్మారి ప్రభావాన్ని  ఎలా తగ్గించవచ్చనే దానిపై  మీడియా స్థిరమైన ప్రయత్నాలను కొనసాగించినందుకు  అనురాగ్ ఠాకూర్ ఏఐబీడీ  నాయకత్వాన్ని అభినందిచారు. “వైద్య రంగంలో తాజా పరిణామాలు, కరోనా యోధులపై సానుకూల కథనాలు, ముఖ్యంగా మహమ్మారి కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు చాలా ప్రయోజనం పొందాయి” అని ఆయన పేర్కొన్నారు.

ఏఐబీడీ  డైరెక్టర్ శ్రీమతి ఫిలోమినా, జనరల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ మయాంక్ అగర్వాల్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కరోనా మహమ్మారిపై బలమైన మీడియా ప్రతిస్పందనను చైతన్యాన్ని నిర్మించడంలో కలిసి పనిచేసిన సభ్య దేశాలను ఠాకూర్ ఈ సందర్భంగా అభినందించారు.

సాధికారతకు సమర్థవంతమైన సాధనంగా ప్రజల అవగాహనలను, దృక్పథాలను రూపొందించడంలో మీడియా దాని అన్ని రూపాల్లో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ” “జర్నలిస్టులు, ప్రసార మిత్రులు మరింత ఉత్సాహవంతంగా సానుకూలంగా పని చేయడానికి వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం అత్యవసరం” అని ఆయన సూచించారు.

మంచి నాణ్యమైన వార్తా కార్యక్రమాల అనుసంధానాల విషయంలో సహకారాన్ని నిర్మించుకోవాలని ఠాకూర్ సభ్య దేశాలను ప్రోత్సహించారు. అటువంటి కార్యక్రమ మార్పిడి సహకారం ద్వారా  ప్రపంచ సంస్కృతులను ఏకతాటిపైకి తీసుకువస్తుంది. దేశాల మధ్య ఇటువంటి మీడియా భాగస్వామ్యాలు బలమైన సామాజిక బంధాలను నిర్మించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.