సౌర విద్యుత్తుతో ఎలక్ట్రిక్ హైవీల అభివృద్ధి 

సౌర విద్యుత్తుతో ఎలక్ట్రిక్ హైవీల అభివృద్ధి 

సౌర విద్యుత్తు సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులను నడపడానికి వీలుగా ఎలక్ట్రిక్ హైవీలు అభివృద్ధి చేయబోతున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన 19వ ఇండో-అమెరికా ఆర్ధిక సదస్సును వర్చ్యువల్ గా ప్రారంభిస్తూ  దేశ రవాణా వ్యవస్థ విద్యుత్‌తో నడిచే విధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోందని పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల కోసం సోలార్, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని, ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ హైవేలను అభివృద్ధి చేసే అంశం పైనా పనిచేస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా రోడ్లపై వెళ్లే ట్రక్కులు, బస్సులు సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటాయని వివరించారు.

రైల్వే విద్యుత్‌ లైన్ల మాదిరిగానే హై వేలపై లైన్లను ఏర్పాటు చేస్తారని,  వీటి ద్వారా నడుస్త్ను వాహనాలు ఛార్జీంగ్‌ చేస్తారని కేంద్ర మంత్రి చెప్పారు. విద్యుత్‌ తీగల సాయంతో రైళ్లు నడుస్తున్నట్లుగానే ఈ హైవేలపై కూడా సోలార్‌ విద్యుత్‌ తీగలను ఏర్పాటు చేస్తారు. 

ప్రధానమైన కారిడార్‌లో ఏ రూట్‌లో ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని గడ్కరీ తెలిపారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో సైతం సోలార్ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నట్టు గడ్కరీ తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల మేర 26 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మిస్తున్నామని చెప్పారు.

పీఎం గతి శక్తికి స్కీమ్‌ కింద వీటిని నిర్మిస్తున్నామని చెబుతూ రూ. 5 లక్షల కోట్లు, అంటే దాదాపు 60 బిలియన్ డాలర్ల వ్యయం జరుగుతోందని, ఈ  కారిడార్‌ల వల్ల కీలక ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ దూరం 14% తగ్గుతుందని, దీని వల్ల రవాణా ఖర్చు 2.5% తగ్గుతుందని గడ్కరీ వివరించారు. అదనంగా, ప్రతి సంవత్సరం సుమారు 110 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని,  కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 250 కోట్ల కిలోల మేర తగ్గించవచ్చని ఆయన చెప్పారు.

భారత సరకు రవాణా ప్రాజెక్టుల్లో, రోప్‌వేలు, కేబిల్ కార్ రంగాల్లో భాగస్వామ్యానికి అమెరికా ప్రైవేట్ పెట్టుబడిదారులు ముందుకు రావాలని గడ్కరీ  పిలుపునిచ్చారు. నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత ప్రభుత్వం 1.4 ట్రిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతోందని చెబుతూ  2019 నుండి 2025 వరకు ఈ మూలధన వ్యయంలో రోడ్డు రంగం 19% వాటాను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. 

70% సరుకుల రవాణా, దాదాపు 90% ప్రయాణీకుల ట్రాఫిక్ కురహదారి నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నందున భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో రహదారి మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. 2014లో, దాదాపు 91,000 కిలోమీటర్ల జాతీయ రహదారి నెట్‌వర్క్ ఉండగా,  ప్రస్తుతం, ఈ నెట్‌వర్క్ దాదాపు 1.47 లక్షల కిలోమీటర్లకు చేరుకుందని గడ్కరీ వెల్లడించారు.

2025 నాటికి జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను 2 లక్షల కిలోమీటర్లకు విస్తరించేందుకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. జాతీయ రహదార్లకు ఆనుకుని దాదాపు 3 కోట్ల చెట్లు నాటుతున్నామని చెబుతూ ఇంతవరకు 27,000 చెట్లు నాటిన్నట్లు చెప్పారు.