మోదీ పనితీరుకు డొనాల్డ్ ట్రంప్ కితాబు

మోదీ పనితీరుకు డొనాల్డ్ ట్రంప్ కితాబు

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కితాబునిచ్చారు. భారత్‌కు తనకన్నా మంచి మిత్రుడు ఇప్పటివరకు ఎవరూ లేరని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 

న్యూయార్క్ సమీపంలోని బెడ్‌మిన్‌స్టర్‌లోని గోల్ఫ్ క్లబ్‌లో ఎన్‌డి టివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో భారత ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ లేక మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వంటి వారి కన్నా భారత్‌తో మీకు మరింత మెరుగైన సంబంధాలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఈ ప్రశ్నను ప్రధాని మోదీకి మీరు వేయాలంటూ ట్రంప్ సూచించారు. 

తనతో మోదీకి ఉన్న స్నేహబంధం మరెవరితో లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. భారతీయ సమాజం నుంచి లభించిన భారీ మద్దతుతో పాటు ప్రధాని మోదీతో తన అనుబంధాన్ని గురించి కూడా  మాట్లాడారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అమెరికా, భారత్‌లో జరిగిన భారీ సభలను గురించి ఆయన గుర్తు చేశారు. 

భారత్‌తో, ప్రధాని మోదీతో తనకు గొప్ప అనుబంధం ఉందని, తాము మంచి మిత్రులమని ట్రంప్ చెప్పారు. భారత ప్రధాని పదవిని నిర్వహించడం ఆషామాషీ కాదని, మోదీ అద్భుతంగా పాలిస్తున్నారని అన్నారు. మోడీ చాలా మంచి వ్యక్తి అని, ప్రధానిగా అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. 

ఆయన ఎంతో కష్టపడి ఆ పదవిలోకి వచ్చారని, తామిద్దరం చాలాకాలంగా ఒకరికొకరం తెలుసునని, మంచి వ్యక్తని అంటూ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. 

2024లో తాను తిరిగి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేకపోలేదని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పదవికి 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని తనను అందరూ కోరుతున్నారని, అభిప్రాయ సేకరణ సర్వేలలో కూడా తాను ముందంజలో ఉన్నానని తెలిపారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 

అమెరికా అధ్యక్ష పదవిని మళ్ళీ చేపడితే అమెరికా తన ప్రాధాన్యతలు ఏమిటనే ప్రశ్నకు అమెరికాకు ఇంధన స్వాతంత్ర్యాన్ని, గొప్ప ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తానని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ తీరుపై పెదవి విరిచారు. రికార్డు స్థాయిలో ఉద్యోగావకాశాలను కల్పిస్తానని చెప్పారు. తాను అధ్యక్షునిగా ఉన్న కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.