పోలవరంపై సిఎంల స్థాయిలో తేల్చుకోమన్న `సుప్రీం’ 

పోలవరంపై అవసరమైతే ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో చర్చలు జరపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సరిహద్దు రాష్ట్రాలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదక అందించాలని ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖను ఆదేశించింది. 
 
నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించలేదంటూ తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలు సుప్రీంను ఆశ్రయించాయి. తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు ఉన్నాయని కొందరు వ్యక్తులు, సంస్థలు కలిపి పిటిషన్లు వేశారు. పర్యావరణ శాఖ అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని ఫిర్యాదు చేశారు. పర్యావరణ అనుమతులపై పునః సమీక్ష చేయాలని సుప్రీంను కోరారు. 
 
 ప్రాజెక్టు ముంపు, పర్యావరణ అంశాలపై ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రేలా సంస్థ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
‘ఆ మూడు రాష్ట్రాల ఆందోళనలపై కేంద్రం చొరవ తీసుకుని భాగస్వామ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహిస్తే వాటిని పరిష్కరించవచ్చు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శక పాత్ర పోషించి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సలహాలు వచ్చాయి. సమస్య పరిష్కారానికి తగిన అత్యున్నత స్థాయిలో సమావేశాలను నిర్వహించి అసవరమైన చర్చలు జరపాలి. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రులు కూడా సమావేశం కావచ్చు’ అని సూచించింది. 
 
నెల రోజుల్లో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, తరచూ భేటీలు నిర్వహించి తమకు నివేదిక సమర్పించాలని జలశక్తి శాఖను ఆదేశించింది.  కేసు విచారణలో అదనపు పత్రాలు సమర్పించేందుకు రాష్ట్రాలు అనుమతి కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించింది. కేసు విచారణ డిసెంబర్ 7కి వాయిదా వేసింది.