మోదీ సానుభూతి చూపితే విషం కక్కిన పాక్ ప్రధాని!

విపత్కర సమయంలో కూడా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సాధారణ దౌత్యపర మర్యాదలను సహితం ఉల్లంఘిస్తూ భారత్ పై విషం గక్కుతున్నారు. పాకిస్థాన్ ప్రజలు అసాధారణ వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతి చూపారు. అంతేకాకుండా, పాక్ ప్రజలను ఆదుకోవడంకోసం తన వంతు సహాయం చేయాలనీ భారత్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. 
 
మరోవంక, పాకిస్థాన్ మంత్రులు, వ్యాపారులు సహితం ఇటువంటి కష్టకాలంలో భారత్ తో 2019లో నిలిచిపోయిన వ్యాపార సంబంధాలను పునరుద్ధరింప చేయాలని బహిరంగంగా కోరుతూ వస్తున్నారు. ఇటువంటి విపత్కాలంలో కూడా పాక్ ప్రధాని బాధ్యతను మరచి వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని భారత్ జమ్మూ కాశ్మీర్ లో నరమేథంకు పాల్పడుతున్నదని అంటూ విషం కక్కారు. 
పాకిస్థాన్‌లో వరదల వల్ల సుమారు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఓ ట్వీట్ చేస్తూ పాకిస్థాన్‌లో వరదల వల్ల జరిగిన విధ్వంసాన్ని చూసి తాను చలించిపోయానని తెలిపారు. బాధితులకు సానుభూతి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అతి త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు.
పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ స్థానిక మీడియాతో సోమవారం మాట్లాడుతూ, వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం భారత దేశం నుంచి కూరగాయలు, ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం గురించి తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
అయితే, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మంగళవారం అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ  భారత దేశంతో వాణిజ్యాన్ని పునరుద్ధరిస్తారా? ఆహార పదార్థాలు, కూరగాయలు దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అని విలేకర్లు అడిగినపుడు విషంకక్కారు.  భారత దేశంతో వ్యాపారం చేయడంలో సమస్యలేవీ లేవంటూనే భారత్ లో నరమేధం జరుగుతోందని అసందర్భ ఆరోపణలు చేశారు. 
 
కశ్మీరీల హక్కులు నిరాకరణకు గురవుతున్నాయని, భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి, కశ్మీరును బలవంతంగా కలుపుకున్నారని వాపోయారు. అయితే తాను ప్రధాని మోదీతో చర్చించడానికి సిద్ధమేనని చెప్పారు. ఈ సమయంలో రాజకీయాలు చేయకూడదని అంటూనే భారత్ లో మైనారిటీల హక్కులు అణచివేతకు గురవుతున్నాయనేది వాస్తవమని చెప్పారు.  పాక్ ప్రధాని ధోరణి పట్ల ఆ దేశ రాజకీయ వర్గాలలో సహితం విస్మయం వ్యక్తం అవుతున్నది.