సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం

సీజేఐగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణ స్వీకారం
భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము జస్టిస్ యు.యు.లలిత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ  ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ పదవీ విరమణ చేయడంతో జస్టిస్ యు.యు.లలిత్ కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కూడా పాల్గొన్నారు.
 
జస్టిస్‌ యుయు లలిత్‌ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్‌లో న్యాయవాద వఅ   వృత్తిలోకి ప్రవేశించారు. రెండేళ్ల పాటు ముంబయి హైకోర్టులో ప్రాక్టీసు చేసిన ఆయన.. 1986 జనవరిలో ఢిల్లీకి మారారు. 2004 సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌గా నియమితులయ్యారు. 
 
2014 ఆగస్టు 13న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనేక కీలక కేసుల తీర్పుల్లో జస్టిస్‌ లలిత్‌ కూడా భాగస్వామిగా ఉన్నారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేరుగా బాధ్యతలను స్వీకరించిన ఘనత ఈయనది. మరొకరు మాత్రమే ఇప్పటి వరకు ఆ విధంగా పదవి చేపట్టారు.
కాగా.. యు.యు. లలిత్‌ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత సీనియార్టీ జాబితాలో ఉన్న జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నియమితులయ్యే అవకాశాలున్నాయి.