
భారత్ కలలను, ఆశలను నెరవేర్చడం ద్వారా జాతి అభివృద్ధి నిర్మాణంలో దేశ శ్రామిక శక్తి ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ రకమైన ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమం కోసం నిరంతరంగా పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. శ్రామికశక్తిని సామాజిక పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.
గురువారం సాయంత్రం తిరుపతి వేదికగా జరిగిన జాతీయ కార్మిక సదస్సును ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్.హెచ్ భూపేంద్ర యాదవ్ అధ్యక్షత వహించారు. వివిధ రాష్ట్రాల కార్మిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన కార్మిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కార్మికుల సదస్సుకు పవిత్ర స్థలాన్ని వేదిక చేసుకోవడం అభినందనీయమని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కార్మిక, ఉపాధి కల్పన, పెట్రోలియం, సహజవాయు శాఖల సహాయ మంత్రి రామేశ్వర్ కూడా పాల్గొన్నారు. దేశాన్ని ఒక్కటి చేయడంలో కార్మికుల పాత్ర అభినందనీయమని ప్రధాని కొనియాడారు.
ఈ సదస్సునుద్దేశించి మోదీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన వంటి పథకాలు కోట్లాదిమంది కార్మికులకు ఎంతోకొంత రక్షణను, భద్రతను కల్పిస్తున్నాయని వివరించారు. దేశాభివృద్ధికి కార్మికులు చేస్తున్న కృషి, అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపు ఈ పథకాలని మోదీ అభివర్ణించారు.
ఓ అధ్యయనం ప్రకారం ది ఎమర్జెన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కరోనా కష్టకాలంలో 1.50 కోట్ల ఉద్యోగాలను కాపాడిందని తెలిపారు. దేశం కార్మికులకు అవసరమైన సందర్భంలో మద్దతుగా నిలిచిందని, అదే సమయంలో కరోనా సంక్షోభం నుంచీ దేశాన్ని గట్టెక్కించేందకు కార్మికులు తమ పూర్తి శక్తియుక్తులను వెచ్చించారని ప్రధాని ప్రశంసించారు. దాని ఫలితంగానే నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ మరోసారి ఆవిర్భవించిందని తెలిపారు.
ఈ ఘనత అధికశాతం కార్మికులకే దక్కుతుందని స్పష్టం చేస్తూ, కార్మిక శక్తికి భద్రత కల్పించడంలో ఇ-శ్రమ్ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోందాని చెప్పారు. ఏడాది కాలంలోనే దేశంలోని 400 ప్రాంతాలకు చెందిన 28 కోట్లమంది కార్మికులు పోర్టల్‌లో నమోదయ్యారని ప్రధాని తెలిపారు. ఇది ప్రత్యేకించి భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, గృహ పనివారికి బాగా మేలు చేసిందని చెప్పారు.
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పోర్టళ్ళను ఇ-శ్రమ్ పోర్టల్‌తో అనుసంధానించుకోవాలని రాష్ట్రాల కార్మిక శాఖా మంత్రులను ఈ సందర్భంగా ప్రధాని అభ్యర్థించారు. మహిళా కార్మికశక్తిని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
గత 8 ఏళ్లుగా బానిసత్వం, పూర్వకాలపు చట్టాల రద్దుతోపాటు ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్టు చెప్పారు. ప్రధానంగా 29కార్మిక చట్టాలు, 4 సాధారణ చట్టాలుఘౠ మార్పు చేసినట్లు ఆయన వివరించారు. లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల సాధికారత, కనీస వేతనం, సామాజిక భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. విజన్ 2047 నాటికి కార్మికశాఖ ప్రత్యేక ముందుచూపుతో నడుస్తుందని, ఎన్నో మార్పులతో కార్మికుడికి మంచి జరుగుతుందన్నారు. దేశాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్పు చేయడానికి దోహదపడుతుందన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను రూ.38 వేల కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించలేదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం డిజిటల్ యుగంలోకి ప్రవేశించిందని, ఆన్‌లైన్‌లో షాపింగ్, హెల్త్ సర్వీసెస్, ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ జీవితంలో భాగమయ్యాయని పేర్కొన్నారు. ఈ రంగాల్లో సరైన విధానాలు, సరైన కృషి దేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేస్తాయని మోదీ చెప్పారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్