కేసీఆర్ తర్వాత మునావర్‌ ఫారూఖీ షోకు కేజ్రీవాల్ అనుమతి

హైదరాబాద్ లో మునావర్‌ ఫారూఖీ షోను అనుమతించి కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఉద్రిక్తత పరిస్థితుల నుండి ప్రజలు ఇంకా కోలుకోకుండానే దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 28న ఈ షో నిర్వహణకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతించింది. 

 అయితే షోను తాము అడ్డుకుంటామని విశ్వహిందూపరిషత్, బజరంగ్ దళ్ ప్రకటించాయి. హిందూ దేవతలను కించపరుస్తూ చేసే మునావర్‌ ఫారూఖీ షోకు అనుమతి ఇవ్వవద్దంటూ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశాయి. హైదరాబాద్‌లో కూడా మునావర్‌ ఫారూఖీ షో నిర్వహించవద్దంటూ హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఆందోళనలు చెలరేగాయి.

 గడిచిన రెండు నెలల్లో దేశవ్యాప్తంగా డజను దాకా మునావర్‌ షోలు రద్దయినా.. హైదరాబాద్‌లో మాత్రం షో నిర్వహించారు.  హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘కామెడీ నైట్‌ టూర్‌’ ప్రదర్శనకు మొత్తం 2,083 మంది ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకోగా.. 85% మంది హాజరయ్యారు. 

షోను కచ్చితంగా అడ్డుకుంటామంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలు హిందూ సంఘాలు రెండు రోజులుగా హెచ్చరికలు చేయడంతో సైబరాబాద్‌ పోలీసులు శిల్పకళావేదిక పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

హాల్‌లోకి వెళ్లే మార్గాల్లో.. బారీకేడ్లతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి, కొండాపూర్‌, కొత్తగూడ చౌరస్తా, మాదాపూర్‌ మొదలు.. అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. 2 వేలకు పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా బీజేపీ, బీజేవైఎం నేతలను గృహనిర్బంధం చేశారు. 

అయినప్పటికీ కొందరు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు శిల్పకళావేదికలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. రాముడి తల్లిపైన, సీతాదేవిపైన కామెడీ షోలు చేస్తున్న వారికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారని, దీని ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మునావర్ షో జరిగిన రోజు రాజాసింగ్ ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా మునావర్‌ షోలు రద్దవుతుంటే, హైదరాబాద్‌లో మాత్రం పిలిచి మరీ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. మునావర్‌ ఫారూఖీ షో హైదరాబాద్‌లో నిర్వహించినందుకు నిరసనగా తాను చేయబోయే కామెడీ షోతో యావత్‌ భారతదేశం షేక్‌ అవుతుందని వ్యాఖ్యానించడమే కాక ఓ వీడియోను కూడా రాజాసింగ్ విడుదల చేశారు.

దీనిపై కలకలం రేగింది. ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఆందోళనలు చేశారు. అనంతరం రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. సాయంత్రానికే బెయిల్ దొరకడంతో ఒక రోజు విరామం తర్వాత  రాజాసింగ్‌పై పీడీయాక్ట్ ప్రయోగించి,  మళ్లీ అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. తెలంగాణలో ఓ ఎమ్మెల్యేపై తొలిసారిగా పీడీయాక్ట్ అమలు చేశారు.