27న హనుమకొండలో జెపి నడ్డా బహిరంగ సభ!

తెలంగాణ పోలీసుల అడ్డంకుతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశ పాదయాత్ర  మూడు రోజుల క్రితం నిలిచిపోయింది. హైకోర్టు జోక్యంతో యాత్ర కొనసాగించాలని ఒక వంక ప్రయత్నిస్తూ, మరోవంక హైకోర్టు అనుమతితో సంబంధం లేకుండా ముందుగా అనుకున్న విధంగా ఈ నెల 27న హనుమకొండలో ముగింపు సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

 ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగే ఈ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ముఖ్యఅతిధిగా హాజరవుతూ ఉండడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాకరంగా తీసుకొని జనసమీకరణ ప్రయత్నాలు ప్రారంభించారు. హైకోర్టులో పాదయాత్ర కొనసాగింపుపై వేసిక లంచ్ మోషన్ గురువారం పరిశీలనకు రానున్నది.

పాదయాత్ర కొనసాగడంపై హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా.. బహిరంగ సభ మాత్రం యథావిధిగా నిర్వహించడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే బుధవారం కరీంనగర్ లో సంజయ్ అధ్యక్షతన ఉత్తర తెలంగాణ జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్​చార్జ్​లు, ముఖ్య నేతల సమావేశం జరిగింది. వరంగల్ సభకు భారీ జన సమీకరణపై ప్రధానంగా చర్చించారు.

పాదయాత్రపై కోర్టు తీర్పు గురువారం వెలువడనుంది. తీర్పు అనుకూలంగా వస్తే మూడ్రోజుల యాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. అయితే ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం కాకుండా పాదయాత్ర దూరం తగించి స్టేషన్ ఘన్​పూర్ నుంచి నేరుగా వరంగల్ వెళ్లేలా రూట్ ను ఖరారు చేస్తున్నారు.

యాత్రకు కోర్టు అనుమతి నిరాకరిస్తే డివిజన్ బెంచ్ కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. యాత్రకు అనుమతి లేకున్నా సభను నిర్వహిస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రావడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. పార్టీ అధికారంలోకి రావాలంటే మునుగోడు ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని, అందుకు ప్రతీ  కార్యకర్త మునుగోడులో ఇంటింటికి తిరిగి బీజేపీని గెలిపించాలని సంజయ్  పిలుపునిచ్చారు. పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు.

 ఈనెల 2న యాదాద్రిలో ప్రారంభమైన పాదయాత్ర 27న వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ముగించాల్సి ఉంది. 19 రోజులు సాగిన పాదయాత్ర జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూరుకు చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పాదయాత్ర అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ శ్రేణులను ఉద్రిక్తతకు గురిచేసింది.

లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చి పాదయాత్రపై ప్రభావం చూపింది. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బీజేపి కార్యకర్తలపై దాడి చేయడంతో పాటు అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేయడం పట్ల సంజయ్ ఆగ్రహంతో రాష్ట వ్యాప్తంగా నిరసన ఆందోళనలకు పిలుపునిచ్చి పాదయాత్ర శిబిరం వద్దే ధర్మదీక్షకు సిద్ధమయ్యారు.

కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం తోపాటు లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలు చేయడంతో టీఆర్ఎస్ నేతలు అగ్గిమీద గుగ్గిలమై పాదయాత్రను అడ్డుకునేందుకు సిద్ధమై భారీగా గులాబీ శ్రేణులు తరలిరావడం ఉద్రిక్తతకు దారితీసింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పోటాపోటీగా బలప్రదర్శనకు సిద్దంకావడంతో  శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉందని గమనించి పోలీసులు ముందు జాగ్రత్తగా బండి సంజయ్ ధర్మదీక్షను భగ్నం చేసి అరెస్టు చేసి కరీంనగర్ లోని స్వగృహానికి తరలించారు.

పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీస్ జారీ చేసి పాదయాత్ర అనుమతి రద్దు చేసి స్టేషన్ ఘనపూర్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. అక్రమ కేసులు అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపి శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగించి 27న ముగింపు సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.