వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేసీఆర్ తో బహిరంగ చర్చకు సవాల్ 

పొలాలకు మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని మునుగోడు బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ చేశారు. అటువంటి ఉద్దేశ్యం లేదని కేంద్రం పలుమార్లు స్పష్టత ఇచ్చినా ఆయన పదేపదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండియపడ్డారు. ఈ విషయమై కేసీఆర్ తో బహిరంగ చర్చకు బిజెపి సిద్ధంగా ఉన్నదని ఆయన సవాల్ చేశారు.
 మోటర్లకు మీటర్లు బిగించాలని కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న మాట నిజమైతే వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి లేదా లై డిటెక్టర్‌ టెస్ట్‌ కు కేసీఆర్‌ సిద్ధమా? అని నిలదీశారు. మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని బిజెపి తెలంగాణశాఖ నిరూపిస్తుందని, అందుకు తగ్గ ఆధారాలను చూపిస్తామని స్పష్టం చేశారు.
తాము చూపెట్టే ఆధారాలను చూసినతరువాత తప్పయిందని కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఒప్పుకుని ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెబుతారా? అని సంజయ్ సవాల్ చేశారు.  ఒకవేళ టీఆర్‌ఎస్‌ మాది తప్పని నిరూపిస్తే బిజెపి తెలంగాణశాఖ దేనికైనా సిద్ధమే? అని చెబుతూ బిజెపి తెలంగాణ శాఖ సవాల్‌ కు అంగీకరించాలని కేసీఆర్‌ ను ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికే దేశంలో 17 రాష్ట్రాల్లో బిజెపి -ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని చెబుతూ  ఎక్కడైనా ఆ రాష్ట్రాలలో రైతులను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు  కేసీఆర్‌ చూపించగలరా? అని సవాల్ చేశారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని సంజయ్ భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలలో సహితం వ్యవసాయ బోర్లకు మీటర్లు అవసరం లేదని స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. 
 
ఆర్ధికంగా రాష్ట్రం  దివాలాకోరు పరిస్థితులలో ఉండడంతో రైతులు ఉచితంగా విద్యుత్ సరఫరాను కొనసాగించడం చేతకాక ఇటువంటి దుష్ప్రచారాలు దిగుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికే డబ్బులేని ప్రభుత్వం ఉచితంగా విద్యుత్  ఇవ్వడానికి నానా అవస్థలు పడుతున్నల్టు తెలిపారు. 
 
కాగా, విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్రంలోని విద్యుత్‌ సంస్థల వద్ద రూ 50 వేల కోట్ల అప్పు చేసిన్రని తెలిపారు. ఇప్పుడా అప్పు తీర్చకపోతే రాష్ట్రంలోని డిస్కంలన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిరదని చెప్పారు. విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని గుర్తు చేశారు. డిస్కంలను నమ్ముకుని కరెంట్‌ సరఫరా చేసిన జనరేటర్స్‌ (విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు) బ్యాంకుల నుండి వేల కోట్ల రుణాలు తెచ్చుకున్నయని,  ఆ సంస్థలు కూడా చేతులెత్తేశాయని తెలిపారు.
దీనికంతటికీ కారణం కేసీఆరే అని స్పష్టం చేశారు. 
దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదే విధమైన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపైన గ్లోబల్స్‌ ప్రచారం చేసి రైతులను మభ్యపెట్టాలని చూశారని సంజయ్ గుర్తు చేశారు. ప్రజలను అరిగోస పెడుతూ.. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌ పాలనపై పోరాడాల్సిన కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు పూర్తిగా దిగజారిపోయిండ్రని ధ్వజమెత్తారు.  కమ్యూనిస్టులు ‘‘ఎర్రగులాబీలు’’గా మారి కేసీఆర్‌ చంకన చేరిపోయిండ్రని సంజయ్ ఎద్దేవా చేశారు. బిజెపిని ఓడిస్తేనే తమకు మనుగడ ఉంటుందనే భావనతో కాంగ్రెస్‌ నేతలు టీఆర్‌ఎస్‌ కోవర్టుల్లా మారిపోయిండ్రని ఆరోపించారు.