రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం

రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం

మునుగోడులో జరుగనున్న ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనను గెలిపిస్తే తెలంగాణాలో కేసీఆర్‌ అవినీతి సర్కారు మాయం అవుతుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు.  కేసీఆర్‌ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని  ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆదివారం ప్రసంగిస్తూ తెలిపారు.  కేసీఆర్‌  సర్కార్‌.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు.

మజ్లిస్‌ భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్‌ జరపట్లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని అమిత్‌షా ప్రకటించారు. ‘‘పేదవారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కేసీఆర్‌ ఇచ్చారా?. నిరుద్యోగులు రూ.3 వేలు ఇస్తామని కేసీఆర్‌ మాట తప్పారు. ప్రతి జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా’’ అంటూ అమిత్‌ షా ప్రశ్నించారు.

“సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం హామీ ఏమైంది?.  దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ చెప్పారు.. కానీ అది జరగలేదు. మళ్లీ గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ వస్తారు. పేదలకు ఇల్లు ఇస్తామన్నారు?.. ఇచ్చారా?. మోదీ ఇచ్చే టాయిలెట్లను కూడా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారు. దళిత కుటుంబానికి రూ 10 లక్షలు అందిస్తామని హుజూరాబాద్‌లో చెప్పారు. ఎంత మంది దళితులకు రూ.10 లక్షలు వచ్చాయి?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

“దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చారా?.  గిరిజనులకు ఎకరం భూమి ఎక్కడైనా ఇచ్చారా?. రాష్ట్రంలో 2014 నుంచి టీచర్ల నియామకాలు జరగలేదు. గిరిజనులకు ఎకరం భూమి ఎక్కడైనా ఇచ్చారా?.  ’’ అని అమిత్‌ షా  కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఉద్యోగాలు కేసీఆర్‌ కుటుంబాలకు తప్ప ఎవరికీ దక్కలేదని అంటూ ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలనను దించడం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ తల్లి విముక్తి కావాలని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యను తీర్చేందుకు కేంద్రం రూ. 750 కోట్లు ఇచ్చిందని.. అది కూడా రాష్ట్రం ఇచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు చెప్పటం సిగ్గుచేటు అని కేంద్ర మంత్రి విమర్శించారు. 

మునుగోడు ఉప ఎన్నికలో  కేసీఆర్ ను బండకేసి కొట్టాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ మునుగోడు సభ జనం లేక వెలవెల బోయిందని చెబుతూ  రైతులను, యువతను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రూ.2 లక్షల కోట్ల సబ్సిడీ, ఫసల్ బీమా పథకంతో ఓ వైపు మోడీ  రైతులను ఆదుకుంటుంటే… ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా పై కేసీఆర్ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

రైతుల్ని, దళితుల్ని కేసీఆర్‌ మోసం చేశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. మునుగోడు నుంచే కేసీఆర్‌ పాలనకు అంతం పలుకుతామని స్పష్టం చేస్తూ  కేసీఆర్‌కు ఫ్రస్టేషన్‌ ఎక్కువైపోయిందని ఆమె చెప్పారు. తప్పు చేసిన వారే భయపడతారన్నారని అంటూ  కేసీఆర్‌ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌ ఎన్ని ఎత్తులువేసినా బీజేపీ నాయకుల్ని వేరు చేయలేదరని విజయశాంతి స్పష్టం చేశారు.

ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం పోవాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెబుతూ ఎనిమిదేళ్లుగా సీపీఐ, సీపీఎం నేతలు ప్రగతి భవన్‌లో అడుగుపెట్టారా? ధర్నా చౌక్‌ను నిషేధించిన కేసీఆర్‌కు లెఫ్ట్‌ పార్టీ మద్దతా అంటూ ఈటల మండిపడ్డారు.

ఆర్టీసీ ట్రేడ్‌ యూనియన్లను రద్దు చేసినప్పుడు ఎక్కడున్నారు?. కేసీఆర్‌ ద్రోహాలు వామపక్ష నేతలు మర్చిపోయారా? అని ఈటల ప్రశ్నలు సంధించారు.