ఢిల్లీ ఎక్సైజ్ డీల్‌లో కేసీఆర్ కుటుంబం

ఢిల్లీ ఎక్సైజ్ డీల్‌లో కేసీఆర్ కుటుంబం

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ లిక్కర్ పాలసీకి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో రూపకల్పన జరిగిందని పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ వెల్లడించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక సంచలన ఆరోపణలు చేశారు. ఒబెరాయ్ హోటల్లో ఆరు నెలల పాటు సూట్ రూమ్ ఒకటి బుక్ అయి ఉందని చెప్పుకొచ్చారు.

ఎక్సైజ్ కమిషనర్, ఢిల్లీ డిప్యూటీ సీఎం, లిక్కర్ మాఫియా, ఎక్సైజ్ అధికారులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆ హోటల్ రూం డీల్‌లో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని మద్యం మాఫియాకు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన విమానంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీ వచ్చేవారని ఆయన తేల్చి చేప్పారు.

ఒబెరాయ్ హోటల్లో సూట్ రూం బుక్ చేసింది కూడా ఆయనేనని పర్వేష్ వర్మ పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఆయనే ఈ పాలసీని రూపొందించారని వివరించారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ లలో ఇదే లిక్కర్ పాలసీ అమలవుతోందని నొక్కి చెప్పారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఢిల్లీ ఎల్ 1 లైసెన్స్ హోల్డర్స్, తమ వ్యక్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారని పర్వేష్ తెలిపారు. ఈ డీల్‌లో మొదటి వాయిదాగా రూ. 150 కోట్లు ఇచ్చారని, తెలంగాణ నుంచి వచ్చిన వారే ఈ సొమ్మును ముట్టజెప్పారని ఆయన ఆరోపించారు.