బీహార్‌లో 72 శాతం మంత్రులపై క్రిమినల్ కేసులు

బీహార్‌లో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 70 శాతానికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల హక్కులకు చెందిన సంస్థ ఎడిఆర్ వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై కూడా కేసులు ఉన్నాయని ఎడిఆర్ తెలిపింది. 
 
2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసిన 32 మంది మంత్రుల స్వయం ప్రకటిత అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) విశ్లేషించి తన నివేదిక వెల్లడించింది.  32 మంత్రులలో 23 మందిపై (72 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని, 17 మందిపై (53 శాతం)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎడిఆర్ తెలిపింది.  
మంత్రులలో అత్యధిక ఆస్తులు ఉన్న వారిలో మధుబని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సమీర్ కుమార్ మహాసేట్ ఉన్నారని, ఆయన ఆస్తుల విలువ రూ.24.45 కోట్లని ఎడిఆర్ తెలిపింది. రూ.11.60 లక్షల ఆస్తులతో చెనారి (ఎస్‌సి) నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మురారీ ప్రసాద్ గౌతమ్ ఉన్నారని తెలిపింది.
మొత్తం మంత్రుల్లో 27 మంది(84 శాతం) కోటీశ్వరులుకాగా, మొత్తం 32 మంది మంత్రుల సగటు ఆస్తుల విలువ రూ.5.82 కోట్లు. పాతిక శాతం మంది మంత్రులు తమ విద్యార్హతలు 8వ తరగతి నుంచి ఇంటర్‌లోపేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌ ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించారు. జేడీ(యూ) నుంచి 11 మంది, ఆర్‌జేడీ నుంచి 16 మంది, కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, జితన్‌ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యే మంత్రులుగా కొనసాగుతున్నారు.