మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి

మహబూబ్ నగర్ లో బహిరంగంగా గాల్లో కాల్పులు జరిపిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను  డిమాండ్ చేసారు. శనివారం తిరంగా ర్యాలీలో మంత్రి గాల్లో కాల్పులు జరిపిన విషయంపై ఆమె దిగ్బంతి వ్యక్తం చేశారు. 
 
అసలు తెలంగాణ లో పోలీసు వ్యవస్థ ఉందా అని ఆమె ప్రశ్నించారు. తాను క్రీడా మంత్రినీ అని, కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని మంత్రి చెప్పడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. అయితే తన వెంట ఉన్న భద్రతా సిబ్బంది వాడుతుంది రబ్బర్ బుల్లేటా అని అరుణ ఎద్దేవా చేసారు.
 
తెలంగాణ లో తెరాస నాయకుల ఆగడాలు తారా స్థాయికి చేరాయని, వారిని నియంత్రించాల్సిన పోలీసులు భజన చేస్తున్నారని అరుణ ఆరోపించారు. మంత్రికి అడుగులకు మడుగులు ఒత్తుతూ పోలీస్ సిబ్బంది మంత్రినీ సమర్దిస్తూ పోలీస్ శాఖను కించపర్చుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 జిల్లా ఎస్పి తనను తుపాకీ తో గాల్లో కాల్చుమని చెప్పాడని, స్వయాన మంత్రి చెప్పిన విషయాన్నీ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పరిగనంలోకి తీసుకొని అధికారినీ సస్పెండ్ చేయాలని అరుణ డిమాండ్ చేశారు.
 
ఫ్రీడమ్‌ ర్యాలీలో మంత్రి హల్‌చల్‌
ఫ్రీడమ్‌ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హల్‌చల్‌ చేశారు. పోలీసుల నుంచి తుపాకీ తీసుకుని గాల్లో పేల్చారు. ఎస్‌ఎల్‌ఆర్‌ వెపన్‌తో గాల్లోకి మంత్రి కాల్పులు జరిపారు. శ్రీనివాస్‌గౌడ్‌ కాల్పుల వీడియో సోషల్‌మీడియా లో వైరల్‌ అవుతోంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తీరుపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికారులు సైతం ఆయన్ని అడ్డుకోలేదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి అయితే మాత్రం గాల్లో కాల్పులు జరుపుతారా అని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ ర్యాలీలో నిర్వహించారు. ర్యాలీ ప్రారంభించే ముందు ఎస్పీ వెంకటేశ్వర్లు తన వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ వెపన్‌‌ను శ్రీనివాస్‌గౌడ్‌కు ఇచ్చారు. గౌరవపదంగా ఆయన గాలిల్లో కాల్పులు జరిపారు.
నిబంధలను విరుద్ధంగా ఎస్పీ తుఫాకి ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా మంత్రి కాల్పులు జరపడం సర్వత్రా చర్చనీయాంశమైంది.  పోలీసులు మంత్రికి గన్‌ ఇవ్వడంపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ర్యాలీలో మంత్రికి గన్‌ ఎలా ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్‌గౌడ్ ఫైరింగ్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన వివరణ ఇచ్చారు. తాను రైఫిల్‌ అసోసియేషన్‌ సభ్యుడినని తెలిపారు. తనకు ఎస్పీనే తుపాకీ ఇచ్చారని, తాను కాల్చింది రబ్బర్‌ బుల్లెట్లు అని తెలిపారు. స్పోర్ట్స్‌ మీట్స్‌లో ఇలా కాల్చడం సహజమేనని శ్రీనివాస్‌గౌడ్‌ సమర్ధించుకున్నారు.
 ‘‘నేను ఆల్ ఇండియా రైఫెల్ అసోషియేషన్ మెంబర్‌ను. క్రీడా శాఖమంత్రిగా నాకు ఆ అర్హత కూడా ఉంటుంది. కానీ, నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.