వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ నిషేధం

వాణిజ్య ప్రకటనల్లో మహిళలు నటించడంపై ఇరాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. డోమినో కంపెనీ రూపొందించిన రెండు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. హిజాబ్‌ లో ఉన్న ఓ యువతి కారు నడుపుతూ ఉంటుంది. అయితే మాటిమాటికీ ఆమె పక్క సీటు వైపుకి చూస్తూ కన్ను గీటుతుంటుంది. 

తర్వాత గ్రీనరీ ఉన్న ప్రదేశానికి చేరుకుని మాగ్నమ్  ఐస్‌ క్రీమ్‌ కొరుకుతున్నట్లు చూపించారు.  యువతి వస్రధారణను ఐస్‌క్రీమ్‌తో పోల్చుతూ మరో యాడ్  రూపొందించారు. ఈ ప్రకటనలతో  మహిళల విలువను తగ్గించారని ఇరాన్‌ సంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇస్లామిక్‌ మత శాఖ ఆగ్రహం వ్యక్తం చేశాయి. పైగా, అనేక అపార్ధాలు కలిగించే విధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఈ యాడ్‌ చేసిన డోమినో కంపెనీపై కేసులు పెట్టాలని ఇరాన్‌ లోని మతగురువులు డిమాండ్‌ చేస్తున్నారు. మహిళల విలువలకు అవమానంగా ఈ యాడ్‌ ఉందని అక్కడి మతగురువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని రకాల వాణిజ్య ప్రకటనలలో మహిళలు నటించడంపై నిషేధాన్ని విధించాయి. 

ఈ మేరకు అన్ని థియేటర్స్‌, యాడ్‌ ఎజెన్సీలకు అక్కడి ప్రభుత్వం లేఖలు రాసింది. హిజాబ్‌, మత పవిత్రత నియమాలను ధిక్కరిస్తున్న నేపథ్యంలో మహిళలు ఇకపై ప్రకటనల్లో నటించడానికి అనుమతి లేదని ఆదేశాలు జారీ చేసింది. 

1979 ఇస్లామిక్‌ విప్లవం తరువాత అయతొల్లా రుహెల్లా ఖోమేనీ మహిళలు చాదర్‌ ధరించాలని ఆదేశించారు. అప్పటి నుండి ఇరాక్‌ మహిళలకు హిజాబ్‌ తప్పనిసరి అయింది. గత రెండేళ్లలో హిజాబ్‌ ధరించడాన్ని ధిక్కరించిన మహిళలను అక్కడి ప్రభుత్వం నిర్భంధించిన సంగతి తెలిసిందే.

ఇదే కాకుండా, అదే డొమినో కంపెనీ మరొక ప్రకటన కూడా వివాదాస్పదమైంది. ఆ యాడ్‌లో ఓ యువతి ఐస్‌క్రీమ్‌ రంగులు వేసుకుని కనిపించింది. ఫుల్ స్లీవ్ టీ-షర్ట్ మరియు హెడ్ స్కార్ఫ్‌లో ఉన్న ఒక మహిళ తెల్లటి ఐస్ క్రీం బార్‌తో కనిపిస్తుంది. ఐస్ క్రీం నుండి స్ట్రాబెర్రీ సిరప్ బయటకు పడిన తర్వాత, యువతి ఎర్రటి హూడీలో కనిపించి నృత్యం చేస్తుంది. 

అప్పుడు కరిగిన చాక్లెట్ ఐస్ క్రీం బార్‌లోకి వస్తుంది. దీనితో పాటు, యువతి బ్రౌన్ జాకెట్ ధరించి, ఆపై ఈ ఐస్ క్రీం తింటుంది. వాణిజ్య ప్రయోజనాలతో మహిళలను ఆశ్రయిస్తున్నట్లు చూపుతున్న ఈ ప్రకటనపై మత పెద్దలు కూడా మండిపడ్డారు.