కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కాపాడుకొనేందుకు ఏఐసీసీ చేసిన మరో ఫలితం విఫలమైంది. కొద్దీ రోజులుగా పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేయడం, తాజాగా శనివారం పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి వచ్చి కలసి, మాట్లాడారు. రాహుల్ గాంధీని కలవడం కోసం ఢిల్లీకి రావలసిందిగా ఆహ్వానించారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వంశీచంద్ వేర్వేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన ప్రకటించడంతో కాంగ్రెస్ లో కొనసాగేందుకు విముఖంగా ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది.
“నేను కేసీఆర్‌పై ధర్మ యుద్ధం చేస్తున్నా. పదిహేనురోజుల్లో నా నిర్ణయం ఉంటుంది” అంటూ ఆయన వెల్లడించారు. “మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణవ్యాప్తంగా చర్చ జరగాలి. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది కావాలి. ఆ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుంది” అంటూ భరోసా కూడా ప్రకటించారు.
మరోవైపు ఆదివారం నుంచి ఆయన తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నిజయోకవర్గంలో పర్యటించిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
ప్రజాకంఠక పాలన చేస్తున్న సీఎం కేసీఆర్.. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడుపై సీఎం కక్షగట్టారని.. మూడున్నరేళ్లుగా అనేక రకాలుగా అవమానించి అభివృద్ధిని నిలిపేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అతి త్వరలోనే యుద్ధ ప్రకటన చేయబోతున్నానని పేర్కొంటూ రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు.
ఎస్ ఎల్ బి సి, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ లు 90శాతం పనులు 2014 కంటే ముందే పూర్తయినా కేవలం తనను గెలిపించారన్న కారణంతోనే ఈ ప్రాజెక్ట్ లు పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట లెక్క అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేస్తానని రెండేళ్ల క్రితమే చెప్పానని గుర్తు చేశారు.
హుజురాబాద్ లాగా మునుగోడు ప్రజలకు దళితబంధు, సంక్షేమ పథకాలు ఇస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని ఏడాది క్రితమే చెప్పానని పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధి, కేసీఆర్ నియంత పాలనకు చమరగీతం పాడే మరో కురుక్షేత్ర యుద్ధానికి సైరన్ పూరిస్తామని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
More Stories
కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్