పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం గత ఎనిమిదేళ్లలో పదిరెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. 2014 ఏడాదికి ముందు ఇది 40 కోట్ల లీటర్లు ఉండగా ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొంటూ ఈ ప్రక్రియతో రైతుల ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు. గుజరాత్ రాష్ట్రం హిమ్మత్‌నగర్ సమీపంలోని సబర్ డెయిరీకి చెందిన పలు ప్రాజెక్టులను గురువారం ప్రారంభించిన తర్వాత ప్రధాని ప్రసంగించారు.
“2014కు ముందు పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉండేది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలనే తమ ప్రభుత్వ నిర్ణయంతో నేడది 10% మేర పెరిగి 400 కోట్ల లీటర్లకు చేరుకుంది” అని ప్రధాని తెలిపారు.
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాన్ని చూపిస్తున్నాయని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. చెరకు, మొక్కజొన్న వంటివాటి నుంచి లభించే ఇథనాల్‌ను పెట్రోల్‌తో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు.
దీనివల్ల భూమిలేని, సన్నకారు రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం, ఉద్యానవనాలు, మత్స్య పరిశ్రమ, తేనె ఉత్పత్తి వంటి అనుబంధ రంగాలను ప్రోత్సహించడం కూడా రైతుల ఆదాయాన్ని పెంచడంలో దోహదపడిందని ప్రధాని వివరించారు.
ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలన్న తమ వ్యూహం ఫలితాలు చూపుతోందని ప్రధాని తెలిపారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ తొలిసారిగా రూ.లక్ష కోట్లు దాటిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ రంగాలు గత ఎనిమిదేళ్లలో గ్రామాల్లోని 1.5 కోట్ల మందికి ఉపాధి కల్పించాయని తెలిపారు.
వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, అందుకే ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ధరలు అనేక రెట్లు పెరిగినా ఎరువుల ధరలు పెంచలేదని ప్రధాని గుర్తు చేశారు.
‘‘ఇతర దేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం. 50 కిలోల యూరియా బస్తాకు ప్రభుత్వం రూ.3,500 చెల్లిస్తోంది. కానీ రైతులకు రూ.300కే విక్రయిస్తున్నాం. డీఏపీ ఎరువుల బస్తాపై కేంద్రంపై రూ.500 ఉన్న రాయితీ భారం ప్రస్తుతం రూ.2,500కు పెరిగింది’’ అని మోదీ తెలిపారు.
‘‘ఆదివాసీ తెగకు చెందిన గిరిపుత్రిక తొలిసారి అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టారు. దేశ ప్రజలు ద్రౌపది ముర్ముని భారత రాష్ట్రపతిని చేశారు. ఇది 130 కోట్ల మంది పౌరులందరికీ గర్వకారణం’’ అని మోదీ కొనియాడారు.

More Stories
లింగ నిష్పత్తిలో కేరళ ఆదర్శవంతం
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు