మూడేళ్లలో అడవుల్లో 329 పులులు, 307 ఏనుగుల మృతి

దేశంలో గడచిన మూడేళ్లలో 329 పులులు మృత్యువాత పడ్డాయి. దేశంలో పులులు మృత్యువాత పడుతుండటం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వేటగాళ్ల వేటుకు, సహజ, అసహజ కారణాల వల్ల గత మూడేళ్లలో భారత్ 329 పులులను కోల్పోయిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
 
వేట, విద్యుదాఘాతం, విషప్రయోగం, రైలు ప్రమాదాల కారణంగా మూడేళ్ల కాలంలో 307 ఏనుగులు మరణించాయి.దేశంలోని అడవుల్లో వన్యప్రాణులైన పులులు, ఏనుగులు మరణించడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పులుల మృతిపై గణాంకాలను కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తాజాగా లోక్‌సభలో సమర్పించారు.
2019వ సంవత్సరంలో 96, 2020లో 106, 2021లో 127 పులులు మరణించాయి.68 పులులు సహజ కారణాల వల్ల, ఐదు అసహజ కారణాల వల్ల పులులు మృత్యువాత పడ్డాయి.వేటగాళ్ల వేటుకు 29 పులులు నేలకొరిగాయి.  మొత్తం 197 పులుల మరణాలపై దర్యాప్తు సాగుతుందని మంత్రి చెప్పారు.
పులుల వేట కేసుల సంఖ్య గత సంవత్సరం కంటే తగ్గిందని మంత్రి వివరించారు.2019వ సంవత్సరంలో 17 పులులను వేటగాళ్లు చంపారు. 2021వ సంవత్సరంలో వేటగాళ్ల చేతిలో 4 పులులు మరణించాయి. పులుల దాడుల్లో మూడేళ్లలో 125 మంది మరణించారని మంత్రి వెల్లడించారు. మహారాష్ట్రలో 61మంది, ఉత్తరప్రదేశ్‌లో 25 మందితో సహా మూడేళ్లలో పులుల దాడుల్లో 125 మంది మరణించారు.గత మూడేళ్లలో విద్యుదాఘాతం కారణంగా 222 ఏనుగులు మరణించాయి.
ఒడిశాలో41 ఏనుగులు, తమిళనాడులో 34, అసోంలో33 ఏనుగుల మరణాలు సంభవించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.రైలు ప్రమాదాల్లో 45 ఏనుగులు చనిపోయాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో 23  ఏనుగులు మృత్యువాత పడ్డాయి.మేఘాలయలో 12, ఒడిశాలో ఏడు ఏనుగులతో సహా 29 ఏనుగులను వేటగాళ్లు చంపారని కేంద్రం వివరించింది.
గడచిన మూడేళ్లలో అసోం రాష్ట్రంలో విషప్రయోగం కారణంగా 11 ఏనుగులు మరణించాయి.దేశంలోని అడవుల్లో వన్యప్రాణులైన పులులు, ఏనుగులు మరణించడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.