యుపిలో మత ఘర్షణల కుట్ర భగ్నం

మత ఘర్షణలు సృష్టించేందుకు ఇద్దరు ముస్లిం సోదరులు పన్నిన ఒక కుట్రను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారంనాడు భగ్నం చేశారు. సూఫీ సమాధులు ధ్వంసం చేయడం ద్వారా ఇరువర్గాల మధ్య ఘర్షణలు సృష్టిచేందుకు ప్రయత్నించిన ఈ ఇద్దరిని అరెస్టు చేశారు.
వీరిని మహ్మద్ కమల్ అహ్మద్, మహ్మద్ అడీబ్‌‌గా గుర్తించారు. కమల్, అడీబ్‌లు హిందువుల వేషంలో కాషాయం రంగు తలకట్టు  ధరించి సమాధులపై దాడులు చేశారు. షెర్‌కోట్ ప్రాంతంలో మూడు సమాధులను వీరు ఆదివారం ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు.
 
మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే ఈ దాడులని అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ తెలిపారు. సమాధుల విధ్వంసానికి సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన నిందితులను అరెస్టు చేశామని చెప్పారు.
 
 మత గ్రంథాలను కూడా అపవిత్రం చేసినట్టు పుకార్లు వచ్చాయని, అయితే వాటిలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన వివరించారు. అరెస్టయిన ముస్లిం సోదరులను ప్రత్యేక ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. వారికి ఏదైనా ఉగ్రవాద బృందాలతో సంబంధాలు ఉన్నాయా లేదా ఇంతకు ముందు ఇటువంటి దుశ్చర్యలకు ఎక్కడైనా పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నట్లు తెలిపారు.