
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టబోయే 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఆగష్టు 2 నుండి 26 వరకు, శ్రీ లక్ష్మీ న్రుసింహాస్వామి కొలువు దీరిన యాదాద్రి నుండి ప్రారంభమయ్యే పాదయాత్ర హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు కొనసాగనుంది.
3వ పాదయాత్ర మొత్తం 24 రోజుల పాటు యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, వరంగల్, హన్మకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో మొత్తం 328 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే…. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, జనగాం, వర్దన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.
ఈసారి పాదయాత్ర అనేక చారిత్రాక ప్రదేశాల గూండా కొనసాగనుంది. చేనేత ప్రసిద్దిగాంచిన పోచంపల్లి, రజకార్ల అరాచకాలకు మూకుమ్మడిగా బలైన గుండ్రాంపల్లి, చాకలి ఐలమ్మ పోరు సాగించిన విసునూరు, సర్వాయి పాపన్న పాలనా రాజధాని కిలాషపూర్, తెలంగాణ సాయుధ పోరాట చైతన్య వేదిక కొత్తపేట తోపాటు ఐనవోలు మల్లన్న ఆలయా ప్రదేశాల మీదుగా కొనసాగనుంది.
ఈసారి అనేక గిరిజన తండాలు, బడుగు బలహీనవర్గాల ప్రభావం ఉన్న ప్రాంతాల మీదుగా వెడుతుంది. గత రెండు పాదయాత్రలు విజయవంతంగా కొనసాగిన నేపథ్యంలో మూడో విడత పాదయాత్రను సైతం దిగ్విజయవంతం చేసే దిశగా పార్టీ శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి.
జనం పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకోవడంతో పాటు వారికి భరోసా నింపడం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లడంతోపాటు రాబోయేది బీజేపీ ప్రభుత్వమేననే విశ్వాసాన్ని ఈ పాదయాత్ర ద్వారా పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రజల్లోకి నింపనుంది.
యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభలో కూడా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. కొద్దీ నెలల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్కడైతే భారీ బహిరంగసభలో పాల్గొని, పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారో అదే వరంగల్‌లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో అంతకన్నా పెద్ద ఎత్తున బహిరంగసభ జరపాలనే ముందే సన్నాహాలు ప్రారంభించారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?