గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా మంకీపాక్స్‌

చిన్న‌గా మొద‌లైన మంకీపాక్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఇప్పటి దాకా 75 దేశాల్లో 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) మరింత ఆందోళన చెందుతోంది. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా శనివారం ప్రకటించింది.
 
మంకీపాక్స్‌పై ఆరోగ్య సంస్థకు చెందిన ఎమర్జెన్సీ కమిటీ శనివారం సమావేశం అయింది. ఇందులో పలు దేశాల నుంచి పూర్తిస్థాయి ఏకాభిప్రాయం కుదరకపోయినా ప్రపంచ ఆరోగ్య సంస్థ సొంతంగా నిర్ణయం తీసుకుని దీనిని గ్లోబల్ ఎమర్జెన్సీ జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఈ విధంగా సొంత నిర్ణయం తీసుకోవడం తొలిసారి అయింది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మంకీపాక్స్ ప్రమాదం మధ్యస్థంగా ఉందని డబ్ల్యుహెచ్ఓ   డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధ్నామ్ గెబ్రెయెసస్   హెచ్చరించారు. అయితే ఐరోపా ప్రాంతంలో దీని ప్రభావం కాస్త ఎక్కువే ఉందని అంచనా వేశారు.  గతంలో అరుదైన అసాధారణ వ్యాధిగా ఉండి అంతరించిన మంకీపాక్స్ తిరిగి పలు దేశాలలో విస్తరించుకుని పోవడంతో ఆందోళన వ్యక్తం అయింది. అయితే ఇప్పటికీ సంబంధిత వ్యాధికి సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. 
 
ఓ వైపు కరోనాకు వ్యాక్సిన్ల కొరతతో తల్లడిల్లుతున్న ప్రపంచదేశాలకు ఇప్పుడు అనివార్యంగా మంకీపాక్స్ వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెచ్చుకోవల్సిన పరిస్థితి ఇప్పటి గ్లోబల్ ఎమర్జెన్సీ విధింపుతో ఏర్పడుతోంది. అర్థం కాని పలు విధానాలలో మంకీపాక్స్ విస్తరించుకుని పోతోందని, దీనిని కట్టడి చేసేందుకు ఎమర్జెన్సీ ప్రకటన తప్ప మరో గత్యంతరం లేదని టెడ్రోస్ స్పష్టం చేశారు. 
ఇక‌, మంకీపాక్స్‌ వైరస్‌పై పోరాటానికి ప్రపంచ దేశాల మధ్య సమన్వయం అవరసమని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ చీఫ్‌ టెడ్రోస్ స్పష్టం చేశారు. మశూచి టీకాలు కొంత రక్షణ కలిగిస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు కొత్త టీకాలు అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని సూచించారు.
మరోవైపు బవేరియన్ నార్డిక్ తయారు చేసిన మశూచి వ్యాక్సిన్ ‘ఇమ్వానెక్స్’ను మంకీపాక్స్‌పై పోరాటానికి యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటర్ శుక్రవారం సిఫార్సు చేసింది. భారత్‌లో కూడా మంకీపాక్స్ కలవరం కల్గించింది. కేరళలోనే మూడు కేసులు నిర్థారణ అయ్యాయి. ఇది వ్యాప్తి చెందే పద్ధతి ఏమిటనేది తెలియకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిపై కలవరం అధికం అయింది.