శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా దినేశ్ గుణవర్ధన నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె గురువారం ప్రమాణస్వీకారం చేయడంతో నేడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి బాధ్యతలను సీనియర్ రాజకీయ నేత అయిన దినేశ్ గుణవర్ధనకు అప్పగించారు.
రాజపక్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన గుణవర్ధన గతంలో విదేశాంగ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు గుణవర్ధన శుక్రవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. తదనంతరం మిగిలిన మంత్రి వర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ హాయంలో గుణవర్ధన హోం మంత్రిగా పనిచేశారు. జాతీయ ప్రభుత్వం ఆమోదం పొందే వరకు మునపటి మంత్రివర్గం పనిచేస్తుందని నూతన అధ్యక్షుడు రణిల్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు కాగానే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలిపారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆందోళనకారులు నిరసనలు ఆగడం లేదు. విక్రమసింఘే రాజపక్సల విధేయుడు కావడంతో పరిపాలనలో పెద్దగా మార్పు సంతరించుకోదన్న భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. దీంతో ఆందోళనకారులు కొలంబో వీధుల్లో రణిల్ రాజీనామా చేయాలంటే ఆందోళనలు చేపట్టారు.
కాగా, రణిల్ శాంతియుత నిరసనలకు మద్దతు ఇస్తాను గానీ శాంతియుత నిరసన ముసుగులో హింసాత్మక దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అందులో భాగంగానే అధ్యక్ష భవనం సమీపంలోని నిరసనకారుల శిభిరాల పై లంక సైనికులు, పోలీసులు దాడులు చేశారు.
ఈ మేరకు అధ్యక్ష భవనం ప్రధాన గేటును బ్లాక్ చేస్తూ నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడమే కాకుండా ఆందోళనకారులు ఆ ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలంటూ హచ్చరికలు జారీ చేశారు. అంతేగాదు తొమ్మిది మంది ఆందోళనకారులను కూడా అరెస్టు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రీక్త వాతవరణం చోటు చేసుకుంది.
‘ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నికయ్యారు. రాజపక్సా కుటుంబం ఆయనను తీసుకువచ్చింది.’ అని అరగలయా ఆందోళన గ్రూపు ప్రతినిధి ఫాదర్ జీవంత్ పెరిస్ విలేకర్లతో వ్యాఖ్యానించారు. విక్రమసింఘె కూడా రాజీనామా చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన నొక్కిచెప్పారు.
మాజీ ప్రధాని బండారునాయకె విగ్రహానికి 50మీటర్ల పరిధిలోకి ఎవరూ వెళ్లరాదని నిషేధిస్తూ కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ తిలియానా గమగె ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధాని విగ్రహాన్ని ధ్వంసంచేసే అవకాశాలు వున్నాయని వార్తలు రావడంతో ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు శ్రీలంక పోలీసులు తెలిపారు.

More Stories
భారత్ నాలుగో టీ20లో ఘన విజయం
80 వేలకు పైగా వలసేతర వీసాలు రద్దు!
ట్రంప్ వ్యాఖ్యలతో అణుపరీక్షలకు పుతిన్ ఆదేశం!