తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ 3,000 కోట్ల విపత్తు నిధులు 

తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ 3,000 కోట్ల విపత్తు నిధులు 
విపత్తు నిధులను అందించడంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపుతున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల పట్ల  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి  జి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కోసం గత 8 సంవత్సరాలలో దాదాపు రూ 3,000 కోట్లను, 2018 నుండి నేటి వరకు రూ 1,500 కోట్లకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిందని ఆయన వెల్లడించారు.

 
కేంద్ర ప్రభుత్వం 2018 నుండి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి విపత్తు సహాయనిధిని జాతీయ విపత్తు నిర్వహణ నిధి (ఎన్ డి ఆర్ ఎఫ్) నుండి కేటాయించలేదని చెబుతూ తెలంగాణ రాష్ట్ర సమితి  నాయకులు మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు. అలాగే 2020 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చిన సమయంలో, ఇప్పుడు 2022 లో గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  
 
విపత్తులు సంభవించిన వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టవలసిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత ప్రభుత్వం ఆమోదించిన అంశాలు, నిబంధనలకు అనుగుణంగా ఇది వరకే రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి  (ఎస్ డి ఆర్ ఎఫ్)వద్ద ఉంచిన  నిధులతో రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను చేపడతాయని తెలిపారు. 
 
 తీవ్రమైన విపత్తులు సంభవించిన నేపథ్యంలో, కేంద్ర బృందాలు సందర్శించి రూపొందించిన అంచనాల ప్రకారం ఎన్ డి ఆర్ ఎఫ్ నుండి అదనపు నిధులను ఆయా రాష్ట్రాలకు అందించడం జరుగుతుందని వివరించారు.  విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 48 (1) (ఎ) ప్రకారం రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి అనేది గుర్తించిన  విపత్తులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అందుబాటులో ఉన్న ప్రాథమిక నిధి అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
సాధారణ కేటగిరి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉన్నందున, భారత ప్రభుత్వం తెలంగాణ ఎస్ డి ఆర్ ఎఫ్ కు కేటాయించిన నిధులలో 75 శాతం నిధులను అందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 46 ప్రకారం ఎన్ డి ఆర్ ఎఫ్ అనేది తీవ్రమైన విపత్తులు సంభవించినపుడు రాష్ట్రాల ఎస్ డి ఆర్ ఎఫ్ వద్ద  సరిపడినన్ని నిధులు లేని పక్షంలో, అవసరమైన అదనపు నిధులను కేటాయించడానికి మాత్రమే ఏర్పాటు చేసిన్నట్లు అయన చెప్పారు.
 ప్రకృతి విపత్తు సంభవించినపుడు విపత్తు సహాయక చర్యలను సిద్ధం చేయడం, పునరుద్ధరణ, పునః నిర్మాణం, ఉపశమనం వంటి అంశాలకు నిధులు సమకూర్చడం ఎం డి ఆర్ ఎఫ్ క్రిందకు రాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తీవ్రమైన విపత్తు సంభవించినపుడు, సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన ఖర్చు, రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి అకౌంటు వద్ద ఉన్న నిధుల కంటే ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే ఎన్ డి ఆర్ ఎఫ్ నుండి నిబంధనల ప్రకారం అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
 
నిబంధనల ప్రకారం, ఒక్కో విభాగంలో సంభవించిన నష్టాన్ని, అవసరమైన సహాయక నిధులను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక నివేదికను అందించవలసిన అవసరం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రాథమిక నివేదిక అందిన వెంటనే, ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ లలో  పొందుపరిచిన అంశాలు, నిబంధనల ప్రకారం క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని, సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన నిధులకు సంబంధించిన అంచనాలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సంబంధిత రాష్ట్రాలకు పంపిస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. 
2020-21 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చిన సమయంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి రు. 599 కోట్లను కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వ వాటా రు.449 కోట్లు. ఈ నిధులను రు.224.50 కోట్లు చొప్పున రెండు విడతలుగా ఎస్ డి ఆర్ ఎఫ్ కు జమచేసినట్టు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎస్ డి ఆర్ ఎఫ్ వద్ద రు.1,500 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని చెప్పారు.
అందులో దాదాపు రు.1,200 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు ఉన్నాయని, ఈ నిధులు 2020 లో హైదరాబాద్ లో వచ్చిన వరదల వలన నష్టపోయిన వారికి అవసరమైన సహాయాన్ని అందించటానికి సరిపోతాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అధిక వర్షాల వలన నష్టపోయిన కౌలు రైతులతో సహా రైతులందరికీ కూడా అవసరమైన సహాయాన్ని అందించడానికి కూడా ఈ నిధులు సరిపోతాయని తెలిపారు.
 
అదేవిధంగా 2021-22లో కూడా తెలంగాణ ఎస్ డి ఆర్ ఎఫ్ కు రు.479.20 కోట్లు కేటాయించగా, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు రు.359.20 కోట్లు. గత సంవత్సరంలాగే ఇప్పుడు కూడా రు.179.60 కోట్లు చొప్పున రెండు విడతలుగా ఈ నిధులను ఎస్ డి ఆర్ ఎఫ్ కు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 
 
2014-15 నుండి గత 8 సంవత్సరాల కాలంలో తెలంగాణకు విడుదల చేసిన ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్ నిధుల మొత్తం  రూ 2970.87 అని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై కాగ్ జరిపిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఎస్ డి ఆర్ ఎఫ్ ఖాతాలో రు. 977.67 కోట్ల ప్రారంభ నిల్వ ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 
 
ఈ నిధుల నుండి రు.397.11 కోట్లు ఉపయోగించుకోవడానికి అనుమతులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రు.21.03 కోట్లను మాత్రమే ఉపయోగించుకొన్నట్లు చెప్పారు. కాగా, ప్రస్తుతం సంభవించిన గోదావరి వరదల విషయంలో అవసరమైన సహాయ సహకారాలను అందించటానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన పూర్తి సంసిద్ధతను ఇదివరకే వ్యక్తం చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
.