
తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ప్రజలు ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడి తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తుండడంతో దేశ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి రాజీనామాలకు సిద్ధపడిన నేపథ్యంలో శ్రీ లంకలో సంక్షోభ పరిష్కారంకు అవకాశం ఏర్పడినట్లు శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ సవేంద్ర శిల్వ తెలిపారు.
దేశంలో శాంతిభద్రతలు నెలకొనేలా సాయుధ బలగాలకు, పోలీసులకు మద్దతుగా నిలవాలని ఆదివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని చెప్పారు.
గొటబాయ పాలనతో విసిగి వేసారిన ప్రజలు ఆయన అధికారిక నివాసంలోకి దూసుకెళ్లారు. ఈ పరిణామాలన్నీంటి కన్నా ముందే దేశాధ్యక్షుడు గొటబయా రాజపక్సే పరారయ్యారు. ఈ నిరసనలతో దేశ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే తన పదవికి రాజీనామా చేశారు. తీవ్ర ఆగహ్రంతో ఉన్న ప్రజలు ప్రధాని నివాసానికి నిప్పంటించారు.
ప్రధాని నివాసంలోకి చొచ్చుకువచ్చిన నిరసనకారులు అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు. వీరిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ను వినియోగించారు. విక్రమ్ సింఘే ఈ మే నెలలోనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న ప్రజానీకం రోడ్లపైకి వచ్చి పెద్ద యెత్తున నిరసనలు తెలపడంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రజల సంరక్షణ నిమిత్తం అఖిల పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఆందోళనలను మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, మహెల జయవర్ధనే ఖండిస్తూ సంయమనం పాటించాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే పార్లమెంటులో ఆధిక్యతను నిరూపించుకునేందుకు అవసరమైన 113 మంది సభ్యుల మద్దతును సునాయాసంగా సాధించవచ్చునని ప్రతిపక్ష నేత ఎంఏ సుమంతిరన్ చెప్పినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.
బిలియన్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిన శ్రీలంకలో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రతిపక్ష పార్టీలు సమావేశం కాబోతున్నాయి. ఇలా ఉండగా, శ్రీలంకకు ఉద్దీపన ప్యాకేజ్పై ప్రభుత్వం, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ చర్చలు జరుపుతున్నాయి. మూడు (3) బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజ్ పై చర్చలు జరుగుతున్నాయి.
ఐఎంఎఫ్ ఆదివారం స్పందిస్తూ, శ్రీలంక పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితి పరిష్కారమవుతుందని, తద్వారా ఉద్దీపన ప్యాకేజీపై చర్చల పునరుద్ధరణకు అవకాశంకలుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.
తాజాగా అధ్యక్షుడి నివాసంలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో రాజపక్స ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు బయటపడటంపై జనం మండిపడుతున్నారు. డైలీ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ డబ్బునంతా భద్రతా బలగాలకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి నివాసంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన