గోవా కాంగ్రెస్ లో సంక్షోభం… పలువురు ఎమ్యెల్యేలు బిజెపి వైపు !

గోవా కాంగ్రెస్ లో సంక్షోభం… పలువురు ఎమ్యెల్యేలు బిజెపి వైపు !

గోవా కాంగ్రెస్ పార్టీలో  తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. శనివారం జరిగిన పార్టీ సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో వారు అధికార బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఉండడంతో కధనాలు వెలువడడంతో ఒక్కసారిగా గోవా రాజకీయాలు వేడెక్కాయి.

మరోవంక, ఆ పార్టీకి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. పర్యవసానంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న మైఖెల్‌ లోబోను ఆదివారం ఆ పదవి నుంచి పార్టీ నాయకత్వం తొలగించింది. కొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. 

గోవా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీ కాంగ్రెస్‌ నేతలతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో శనివారం సమావేశం నిర్వహించింది. ఈ కీలక సమావేశంకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గైర్హాజరు అవడం ఆ పార్టీ  నేతలకు కలవరపాటుకు గురిచేసింది.

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదు. వారిలో మైఖేల్ లోబోను కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించడంపై దిగంబర్ కామత్ అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తున్నది.

గోవా అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి. కాంగ్రెస్‌ గోవా ఇన్‌ఛార్జి దినేష్‌ గుండూరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత లోబో, మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌లు బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటూ ఫిరాయింపులు జరిగేలా కుట్ర పన్నుతున్నారని చెప్పారు. 

అందుకే లోబోను పదవి నుంచి తొలగించినట్టు చెప్పారు. వారిద్దరితో పాటు, మరో మగ్గురు ఎమ్మెల్యేలు కేదార్‌ నాయక్‌, రాజేష్‌ ఫల్దేశాయి, దెలియాలాల్‌ లోబోలు ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేరని తెలిపారు.బీజేపీ పెద్దలు పచ్చ జెండా ఊపిన వెంటనే ఆ పార్టీలో చేరిపోయేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది. 

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, తాము ఏ సమయంలోనైనా బీజేపీలో చేరిపోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్ఠానం నుంచి ఫోన్ కాల్ కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. మంత్రి పదవులు, లేదా, ఇతర పదవుల గురించి బీజేపీ తమకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని పేర్కొన్నారు. 

కాగా, అనర్హత వేటు నుంచి తప్పించుకునే విధంగా సామూహికంగా బీజేపీలో చేరాలని ఈ ఎమ్మెల్యేలంతా నిర్ణయించుకున్నట్లు, అందుకు బీజేపీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. అందుకు కనీసం ఎనిమిది మంది ఎమ్యెల్యేలు కాంగ్రెస్ ను వీడవలసి  ఉంటుంది.

గోవా శాసన సభలో 40 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో, మొత్తం 25 మందితో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.  బిజెపి ప్రధాన కార్యదర్శి, గోవా ఇన్ ఛార్జ్ సి టి రవి ఈ సంవత్సరం చివరికి తమకు మద్దతు ఇచ్చే ఎమ్యెల్యేల సంఖ్య  30కు పెరుగుతుందని రెండు నెలల క్రితమే చెప్పడం గమనిస్తే,  పలువురు కాంగ్రెస్ ఎమ్యెల్యేలు బిజెపి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం అవుతుంది.