మహిళా సాధికారతకు అడ్డంకులు తొలగాలి

దేశంలో మహిళా సాధికారతకు అడ్డంకులను తొలగించి, వారిని ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. భారతీయ నాగరికత తత్వం వివిధ రంగాల్లో మహిళల సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, అనేక రంగాల్లో మహిళలు ఇంకా తమ పూర్తి సామర్థ్యాన్ని గుర్తించలేక, ప్రదర్శించలేక వెనుకబడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భారతీయ సనాతన విలువలు మహిళల పట్ల గౌరవ భావాన్ని పెంచే విధంగా తీర్చిదిద్దేవన్న ఉపరాష్ట్రపతి, భారతీయ సంస్కృతిలోని భావనలను యువత అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.

బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆయన ప్రారంభిస్తూ భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో పురుషులతో పోలిస్తే మహిళల స్థూల నమోదు నిష్పత్తి (జి.ఈ.ఆర్) అధికంగా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే,  జాతీయ ప్రాముఖ్యత గల విద్యాసంస్థలలో ఇంకా స్త్రీల నిష్పత్తి పెరగకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రముఖ విద్యాసంస్థల్లో చేరడానికి జరిగే పోటీ పరీక్షల కోసం మహిళలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సహకారాన్ని అందించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. మహిళలు ఉన్నత విద్యతో పాటు, పరిశోధనలు సాగించే దిశగా వారి భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని వెంకయ్య చెప్పారు.

గార్గి, మైత్రేయి వంటి ప్రాచీన భారతదేశంలోని మహిళా పండితుల పేర్లను ప్రస్తావించిన ఆయన, ప్రాచీన కాలం నుంచి మహిళలకు విద్య విషయంలో స్పష్టమైన ప్రాధాన్యత ఉండేదని తెలిపారు. కర్ణాటకలో సైతం అత్తిమ్మబ్బే, సోవాలా దేవి వంటి అనేక మంది అభ్యుదయ పాలకులు, సంస్కర్తలు విద్య ద్వారా మహిళ సాధికారత కోసం దృష్టి సారించిన విషయాన్ని గుర్తు చేశారు.

మౌంట్ కార్మెల్ కళాశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదిగిన ఎందరో మహిళల పేర్లను ప్రస్తావించిన వెంకయ్య, మార్పునకు ఉత్ప్రేరకంగా మహిళా సాధికారత విషయంలో చేసిన కృషికి ఉపరాష్ట్రపతి కళాశాలను ప్రశంసించారు. 21వ శతాబ్ధపు అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ విపణిలో పోటీని తట్టుకునే విధంగా, అన్ని రంగాల్లో విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మౌంట్ కార్మెల్ కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక స్మారక ఎన్వలప్ ను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా, కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డా. అశ్వత్థ నారాయణ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ ఉపకులపతి డా. లింగరాజ్ గాంధీ, కర్ణాటక ప్రాంత చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్ర కుమార్, బెంగలూరు ఆర్చిబిషప్ డా. పీటర్ మఖాడో పాల్గొన్నారు.