
దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్‌నాథ్ పవిత్ర గుహ సమీపంలో శుక్రవారం సాయంత్రం సంభవించిన ఆకస్మిక వరదలలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాయపడ్డ 21 మందిని విమానాల ద్వారా ఆసుపత్రికి తరలించారు.
కొండచరియలు విరిగి పడుతుండటంతో అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మరోవైపు అమర్‌నాథ్ గుహ మందిరంలో శనివారం రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. దాదాపు 15,000 మంది భక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్, బీఎస్ ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఆర్మీ, ఐటీబీటీ జవాన్లు, పోలీసు బృందాలతో శనివారం తెల్లవారుజాము నుంచే సహాయ చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సంభవించిన ఆకస్మిక వరదలో 16 మంది మరణించారని, 40 మందికి పైగా గాయపడ్డారని గందర్‌బాల్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఫ్రోజా షా మీడియాకు చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వారిలో ఐదుగురిని కాపాడినట్టు ఆమె తెలిపారు.
క్షతగాత్రులు, తప్పిపోయిన వారి కచ్చితమైన సంఖ్యను నిర్ధారించే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సహాయక చర్యల కోసం సైన్యం హెలికాప్టర్లను రంగంలోకి దించింది. మరోవైపు బాల్టాల్–హోలీ గుహ మార్గం వైపు మరో మేఘం కదులుతోందని, దీని వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వీటి వల్ల ఆయా ప్రాంతాల్లో వరద ముంచెత్తవచ్చని, కొండచరియలు విరిగి పడిపోవచ్చని తెలిపింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్