అవినీతి ఆరోపణలతో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇన్‌ఛార్జిపై వేటు

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇన్‌ఛార్జి, ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రిని రైల్వే శాఖ సర్వీస్ నుంచి తొలగించింది. ఆయన అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంది.

బుల్లెట్ ట్రైన్ ఇన్‌ఛార్జి బాధ్యతలను రాజేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది. ఆయన ఈ పదవిలో మూడు నెలల పాటు కొనసాగుతారు. సీనియర్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రి రైల్ వికాస్ నిగం లిమిటెడ్ సీఎండీగా తొమ్మిదేళ్ల పాటు పని చేశారు.

ఆ సమయంలో ఓ ప్రైవేటు కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఒకరికొకరు ఇచ్చి, పుచ్చుకునే లావాదేవీలు జరిగాయేమో దర్యాప్తు చేయాలని సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)ను లోక్‌పాల్ జూన్ 2న ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబరు 12లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది.

అనధికారికంగా ఓ ప్రైవేట్ కంపెనీకి నిధులను మళ్లించారని అగ్నిహోత్రిపై ఆరోపణలు వచ్చాయి. అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను  సర్వీస్ నుంచి రైల్వే శాఖ తొలగించి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇన్‌ఛార్జి బాధ్యతలను మూడు నెలలపాటు  ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్   డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) రాజేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది.

హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుల అమలు కోసం భారత ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్  ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్. అగ్నిహోత్రి పదవీ విరమణ తర్వాత ఓ ఏడాదిలోగానే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారని రైల్వే అధికారులు తెలిపారు.

రిటైర్డ్ అధికారులు తాము పదవీ విరమణ చేసిన తర్వాత ఓ ఏడాది నిండక ముందే ఏదైనా కంపెనీలో, వాణిజ్య సంస్థలో ఉద్యోగం పొందకూడదని, ఒకవేళ ఓ ఏడాదిలోగా ఉద్యోగాన్ని స్వీకరించాలంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయని పేర్కొన్నారు. అగ్నిహోత్రి ఈ నిబంధనలను ఉల్లంఘించారని చెబుతున్నారు.

ఇదిలావుండగా, ఈ ఆరోపణలను అగ్నిహోత్రి తోసిపుచ్చారు. తాను ఏ కంపెనీకైనా అనుకూలంగా పని చేయలేదని చెప్పారు. ఇటువంటి పనులను చేసే ఏ కంపెనీలోనూ తన కుమారుడు పని చేయడం లేదని పేర్కొన్నారు.