కేంద్ర మంత్రులు నఖ్వీ, ఆర్‌సీపీ సింగ్ రాజీనామా

కేంద్ర మంత్రులు నఖ్వీ, ఆర్‌సీపీ సింగ్ రాజీనామా
గురువారంతో తమ రాజ్యసభ సభ్యత్వాలు ముగియడం, తిరిగి రాజ్యసభకు ఎన్నిక కాకపోవడంతో కేంద్ర మంత్రులు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ  (బిజెపి), ఉక్కు గనుల శాఖ  మంత్రి  ఆర్‌సీపీ సింగ్ (జెడియు) తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. 
 
బుధవారం మంత్రివర్గ సమావేశం పూర్తి కాగానే రాజీనామాలను సమర్పించారు. వారిద్దరూ అందించిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం నఖ్వీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు.
మైనార్టీ నేతగా నఖ్వీకి ప్రాధాన్యం ఇస్తూ.. ఆయన ఉపరాష్ట్రపతి రేసులో నిలపాలని బీజేపీ యోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. రాజ్యసభ వ్యవహారాలపై నఖ్వీకి మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు తెర మీదకు వచ్చింది.
అయితే బీజేపీ తరపున దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అందుకనే ఆయనకు తిరిగి రాజ్యసభ సభ్యత్వం కొనసాగించలేదని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ఇప్పటికే ప్రారంభమైనది. ఆయనకు ఉపరాష్ట్రపతి దక్కని పక్షంలో గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదవి దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.