సంజయ్‌ రౌత్‌కు ఈడీ సమన్లు

శివ సేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తమ ఎదుట హాజరుకావాలని ఇవాళ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసు ఆరోపణల నేపథ్యంలో సంజయ్ రౌత్ ను ప్రశ్నించాల్సి ఉందని ముంబైలోని ఈడీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొంది ఈడీ.

పాత్రా చావ్ల్‌ భూ కుంభకోణం కేసుకు సంబంధించి రూ  1,034 కోట్ల గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి  ఏప్రిల్‌ నెలలో సంజయ్‌ రౌత్‌కు సంబంధించి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ‘‘నేను భయపడే రకం కాదు. సీజ్‌ చేస్తే.. చేస్కోండి, చంపుకోండి.. కాల్చేయండి.. లేదంటే జైలుకు పంపండి’’ అంటూ ఆ సమయంలో ప్రకటన కూడా చేశారు.

ఇదిలా ఉంటే.. సంజయ్‌ రౌత్‌కు ఈడీ నోటీసులపై ఎకనాథ్ షిండే  తనయుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిండే ఎద్దేవా చేశారు. ‘‘ఈడీ సమన్ల నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌కు నా శుభాకాంక్షలు’’ అంటూ ప్రకటన ఇచ్చాడు. అలాగే.. అనర్హత విషయంలో న్యాయస్థానంలో జరుగుతున్న పోరులో రెబల్స్‌ విజయం సాధిస్తారని ధీమా ప్రకటించాడు. మహారాష్ట్ర ప్రజలు మొత్తం పరిణామాలు చూస్తున్నారని, సరైన సమయంలో సరైన బదులు ఇస్తారని పేర్కొన్నాడు.