అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం డీహెచ్ఎఫ్ఎల్!

బ్యాంకులను వేలకోట్లు  మోసం చేసి పారిపోయిన నీరవ్ మోదీని మించిన మరో కేసు వెలుగుచూసింది. అదే ‘దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ (డీహెచ్ఎఫ్ఎల్)కు చెందిన రూ.34,615 కోట్ల  బ్యాంకింగ్  కుంభకోణం. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం ఇదేనని పరిశీలకులు అంటున్నారు.
ఈ కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి డీహెచ్ఎఫ్ఎల్ డైరెక్టర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ సహా పలువురిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డీహెచ్ఎఫ్ఎల్ తో సంబంధమున్న మహారాష్ట్రలోని 12 ప్రదేశాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,615 కోట్ల మేర మోసం చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగాలు వారిపై ఉన్నాయి.  ఆయా బ్యాంకుల కన్సార్టియం నుంచి 2010 నుంచి 2018 మధ్య కాలంలో దాదాపు రూ.42,871 కోట్ల రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ తమ ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించింది.
పెద్ద ఎత్తున నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలను డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల్లో  తప్పుగా చూపించి, దురుద్దేశపూర్వకంగా వాటిని తిరిగి చెల్లించలేమంటూ చేతులు ఎత్తేశారని సీబీఐ పేర్కొంది.  ప్రధానంగా 2019 మే నెల నుంచి లోన్లను తిరిగి చెల్లించడాన్ని డీహెచ్ఎఫ్ఎల్  ఆపేసిందని, ఫలితంగా బ్యాంకులు ఆయా లోన్లను మొండి బకాయిలుగా ప్రకటించాయని తెలిపింది.
ఆ కంపెనీ డైరెక్టర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ మోసపూరిత చర్యల వల్ల బ్యాంకులకు దాదాపు రూ.34,615 కోట్లు నష్టం జరిగిందని వివరించింది.
ఈ కేసులో నిందితులుగా కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లతో పాటు స్కైలార్క్ బిల్డ్ కాన్ కంపెనీ, దర్శన్ డెవలపర్స్, సిగ్తియా కన్ స్ట్రక్షన్స్ బిల్డర్స్, టౌన్ షిప్ డెవలపర్స్, శిషిర్ రియల్టీ, సన్ బ్లింక్ రియల్ ఎస్టేట్, సుధాకర్ షెట్టి  తదితరులను నిందితులుగా చేర్చింది. వీరందరిపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లోని పలు సెక్షన్ల తో పాటు చీటింగ్అభియోగాలతో కేసులు నమోదు చేశారు.