
సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా నిరసనలు చేస్తున్నారని.. దేశంలో ఈ తరహా నిరసనలు ఊహించలేదని నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ తెలిపారు. అగ్నిపథ్ పై దేశంలోని పలుచోట్ల చెలరేగుతున్న నిరసనలను తాను ఊహించలేదని చెప్పారు. ఈ పథకం దేశానికి, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన స్పష్టం చేసారు.
‘అగ్నిపథ్.. భారత సైన్యంలో అతిపెద్ద రిక్రూట్‌మెంట్ స్కీమ్’ అని ఆయన చెప్పుకొచ్చారు. `అగ్నిపథ్’ పథకాన్ని రూపొందించిన ప్రణాళిక బందంలో తానూ సభ్యుడిగా ఉన్నానని హరికుమార్ తెలిపారు. దీనికోసం ఏడాదిన్నరపాటు పనిచేశానని పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా సైన్యంలో చేరిన వారు తర్వాత సాయుధ బలగాల్లో చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇది సాయుధ బలగాలను అనేక విధాలుగా మారుస్తుందని తెలిపారు. ఇంతకుముందు సాయుధ బలగాల్లో ఒకరు సేవ చేసే చోట.. ఈ పథకంతో నలుగురికి అవకాశం లభించవచ్చని ఆయన పేర్కొన్నారు.
నాలుగేళ్ల సర్వీస్ చాలా తక్కువనే విషయమై హరికుమార్ స్పందిస్తూ అగ్నివీరులుగా సైన్యంలో నాలుగేళ్లు సేవలందించిన తర్వాత అనేక అవకాశాలు ఉంటాయని పునరుద్ఘాటించారు. వ్యాపార రంగంలో అడుగు పెట్టాలనుకుంటే వారికి ఆర్థిక సాయం, బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో, రాష్ట్ర పోలీసు నియామకాల్లో ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు.
కేంద్రం కీలక ప్రకటన
ఇలా ఉండగా, ఈ పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఫలితంగా తొలిబ్యాచ్ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాది అగ్నిపథ్ కింద జరగబోయే నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పొడిగించిన విషయం తెలిసిందే.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు