కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నాలుగేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని పోలీసు, పోలీసు సంబంధిత ఉద్యోగాల్లో ప్రాధాన్యమిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రకటించారు.
అగ్నిపథ్ పథకం యువతను దేశ, సమాజ సేవకు సిద్ధం చేస్తుందని, వారికి గర్వించదగ్గ భవిష్యత్‌ను ఇస్తుందని ఆయన కొనియాడారు. దీనికి ఒకరోజు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ పథకంపై స్పందిస్తూ ఇలాంటి ప్రకటనే చేశారు. పారామిలిటరీ దళాల్లో, అస్సాం రైఫిల్స్‌లో ఉద్యోగాలు కల్పించే సమయంలో అగ్నివీర్‌లకు ప్రాధాన్యత ఇస్తామని హోంశాఖ ప్రకటించింది.
‘‘అగ్నిపథ్ యోజన అనేది యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి తీసుకున్న నిర్ణయం. ఇది స్వాగతించాల్సిన నిర్ణయం” అంటూ కొనియాడారు.
కాగా, సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్‌లలో ఉద్యోగాలు కల్పించే సమయంలో అగ్నిపథ్ పథకంలో భాగంగా నాలుగే సర్వీస్‌ను పూర్తి చేసుకున్న అగ్నివీర్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని బుధవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ట్వీట్ చేశారు. అలాగే దీనిపై వివరణాత్మక ప్రణాళిక సిద్ధమవుతోందని ప్రకటించింది.
‘‘అగ్నిపథ్’’ పేరిట కొత్త సర్వీస్‌ను భద్రతపై కేబినెట్ కమిటీ మంగళవారం ఆమోదించిన కొద్దిసేపటికే రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. త్రివిధ దళాల అధిపతులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్‌తో యువతకు సాయుధ బలగాల్లోకి చేరేందుకు అవకాశం లభిస్తుంది’’ అని చెప్పారు.
కాగా.. ఈ సర్వీసు కింద నియమితులయ్యే సైనికులను ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఎంపికైన వారిని నాలుగేళ్ల కాలానికి సర్వీసులోకి తీసుకుంటారు. 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి మూడున్నరేళ్ల పాటు సర్వీసులో కొనసాగిస్తారు. ఈ సర్వీస్ పూర్తయిన తర్వాత మెరుగైన ప్యాకేజీ అందిస్తారు. అలాగే తుది దశ ఎంపికలో మెరుగైన ప్రతిభ చూపిన 25 శాతం మందికి రెగ్యులర్ కేడర్‌లోకి చేరడానికి అవకాశం కల్పిస్తారు.
90 రోజుల్లో అగ్నివీర్లను నియమించేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది 46,000 మంది సైనికులను ఈ పథకం కింద నియమించుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆర్మీలో 40,000 మంది, వైమానిక దళంలో 3,000, నేవీలో 3,000 మందిని రిక్రూట్ చేసుకోనుంది.

More Stories
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన
తండ్రి పేరు చెప్పడానికి ఎందుకు భయం తేజస్వి?
కుటుంబ వ్యాపారంలా భారత్ రాజకీయాలు