
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలిచేందుకు ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సున్నితంగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఆయనను నిలిపేందుకు మంగళవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, వామపక్షాల సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
‘రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడం లేదు. రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోను’ అని సోమవారం రాత్రే ముంబైలో జరిగిన ఎన్‌సిపి సమావేశంలో శరద్ పవార్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయనే దానిపై శరద్ పవార్‌కు నమ్మకం లేదని, అందుకే పోటీ చేసేందుకు ఆయనకు ఇష్టం లేదని ఎన్‌సిపి వర్గాలు పేర్కొంటున్నాయి.
పవార్ ను అభ్యర్థిగా నిలబెట్టాలని ఒక వంక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మరోవంక మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో పాటు వామపక్షాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడానికి పలు ప్రతిపక్షాలు సుముఖంగా లేకపోవడంతో పవర్ వైపు మొగ్గు చూపుతున్నారు.
శరద్ పవార్‌ను కలిసిన అనంతరం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మంగళవారం మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలిచేందుకు శరద్ పవార్ తిరస్కరించారని చెప్పారు. అంతకుముందు న్యూఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ఆయనతో సమావేశమైనవారిలో మమత బెనర్జీ, సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా, ఎన్‌సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, పీసీ చాకో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని వారికి ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. సీతారాం ఏచూరి మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవార్ పోటీ చేయబోరని చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇతర అభ్యర్థులను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు విముఖంగా ఉన్న మరాఠా యోధుడు శరద్ పవార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ గోదాలోకి దించాలనే మమతా మరోవంక పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. ఆయన విముఖత వ్యక్తం చేసినప్పటికీ బుధవారం న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీయేతర పార్టీల నేతలతో ఓ సమావేశంలో ఆయననే అభ్యర్థిగా పేర్కొంటూ ఓ తీర్మానం ఆమోదించవచ్చని తెలుస్తున్నది.
బుధవారంనాటి సమావేశానికి శరద్ పవార్ కూడా హాజరవుతారని తెలుస్తోంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రతిపక్షాలకు ఉమ్మడిగా ఆమోదయోగ్యమైన మరో అభ్యర్థిని ఎంపిక చేయడం కూడా క్లిష్టతరంగా మారే అవకాశాలు ఉన్నాయి.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు