గుర్గావ్‌లో అక్రమంగా నివసిస్తున్న చైనీయుడి అరెస్ట్

భారత్‌లో రెండేళ్ల నుంచి అక్రమంగా నివసిస్తున్న ఓ చైనీయుడి తోపాటు నాగాలాండ్‌ కు చెందిన ఓ మహిళను గుర్గావ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గుర్గావ్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తున్న వీరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
చైనా దేశస్థుడి పేరు జీ ఫేయి. కాగా అతడు చైనాలోని హెబే ప్రావిన్స్‌లోని జింజీ ప్రాంతానికి చెందినవాడని, అతడి స్నేహితురాలు పెటేఖ్రీనువో నాగాలాండ్‌లోని కోహీమాకు చెందిన మహిళ అని గుర్గావ్ పోలీసులు వెల్లడించారు.  వాస్తవానికి ఫేయి వీసా గడువు జూన్ 2020లోనే ముగిసిపోయింది. అప్పటి నుంచి భారత్‌లో చట్టవిరుద్ధంగానే నివసిస్తున్నాడు. బిహార్‌ పోలీసుల నుంచి సమాచారం అందిన తర్వాత వీరిని అరెస్ట్ చేశామని వివరించారు.
కాగా మరో ఇద్దరు చైనీయులు యెంగ్ హే లుంగ్ (34), లో లుంగ్ (38) నేపాల్‌లోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో ప్రయత్నిస్తూ సరిహద్దు వద్ద ఎస్ ఎస్ బి (సశస్త్ర సీబా బల్)కు పట్టుబడ్డారు. వీరి ద్వారానే గుర్గావ్‌లో మరో చైనీయుడు నివసిస్తున్నట్టు తెలిసింది.  జూన్ 12న సితామర్హి ఔట్‌పోస్ట్ వద్ద ఇద్దరు చైనా దేశస్థులను బలగాలు అరెస్ట్ చేశాయి. మే 25న ఇదే సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారని తేలింది. జూన్ 11వరకు గుర్గావ్‌లోని తమ స్నేహితుడు ఫేయి ఫ్లాట్‌లోనే బస చేసినట్టు వెల్లడైంది.
గ్రేటర్ నోయిడా అడిషనల్ డిప్యూటీ కమిషనర్ విశాల్ పాండే స్పందిస్తూ బిహార్ పోలీసుల సమాచారం అందిన తర్వాత ఫేయి, పెటేఖ్రీనొవోలను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. వీరిద్దరూ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటున్నారని చెప్పారు. నాగాలాండ్‌కు చెందిన పెటేఖ్రీనొవో అరెస్ట్ అయిన ఇద్దరు చైనీయుల కోసం రెండు సిమ్ కార్డులు కొనుగోలు చేసింది.
అంతేకాదు నకిలీ ఓటరు కార్డులను సైతం వారికి సిద్ధం చేసిందని తేలింది. ఫేయి వీసా గడువు జూన్ 30, 2020నే ముగిసింది. కానీ జూన్ 30, 2022 వరకు గడువు ఉన్నట్టు ఫోర్జరీ చేశాడు. వీసా నిబంధనలు అతిక్రమించి ఫోర్జరీకి పాల్పడ్డాడని పాండే వివరించారు.
కాగా చైనా దేశీయులు భారత్‌కు ఎందుకు వచ్చి వెళ్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తామని పాండే చెప్పారు. సంబంధిత ఏజెన్సీలను ఇప్పటికే అప్రమత్తం చేశామని వివరించారు. కాగా అరెస్టయిన వారిని ఇప్పటికే ప్రశ్నిస్తున్నామని చెప్పారు. చట్టబద్ధ ప్రక్రియల ప్రకారం దర్యాప్తు జరుగుతోందన్నారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.