ఏడాదిన్నరలో 10 లక్షల మందికి ఉద్యోగాలు

దేశంలోని నిరుద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం శుభవార్త వెల్లడించారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్‌లో భాగంగా దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వశాఖల్లో 10 లక్షల మందిని రిక్రూట్ మెంట్ చేయాలని ప్రధాని మోదీ మంగళవారం కేంద్ర అధికారులను ఆదేశించారు. 
 
అన్ని ప్రభుత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించిన తర్వాత మోదీ దిశానిర్దేశం చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం  తెలిపింది. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని కేంద్రప్రభుత్వ శాఖలు,మంత్రిత్వ శాఖలలో మానవ వనరుల స్థితిని సమీక్షించారు రాబోయే 1.5 సంవత్సరాలలో 10 లక్షల మందిని మిషన్ మోడ్‌లో ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ చేయాలని ఆదేశించింది’’ అని పీఎంఓ ట్వీట్‌లో పేర్కొంది.
రక్షణ దళాల్లో అగ్నిపథ్ 
 
 కాగా,రక్షణ దళాల్లో చేరాలనుకునే యువతకు దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మరో శుభవార్త వెల్లడించింది. రక్షణ దళాల్లో చేరడం కోసం అగ్నిపథ్ పేరిట కొత్త రిక్రూట్‌మెంట్ పథకాన్ని కేంద్రం మంగళవారం ప్రకటించనుంది. ఈ పథకం కింద కేవలం నాలుగు సంవత్సరాల పదవీ కాలానికి మాత్రమే రక్షణ దళాల్లోకి జవాన్లుగా యువతను నియమించనున్నారు.
 
ఈ పథకం వివరాలను ప్రకటించేందుకు ముగ్గురు ఆర్మీ చీఫ్‌లు నేడు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు.సైనికుల రిక్రూట్‌మెంట్ కోసం అగ్నిపథ్ పథకం గురించి త్రివిధ దళాల అధిపతులు రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. ఇది స్వల్పకాలిక పదవీకాలం కోసం దళాలలోకి యువతను చేర్చడానికి మార్గం సుగమం చేయనుంది.
 
ఈ పథకాన్ని సైనిక వ్యవహారాల శాఖ ప్లాన్ చేసి అమలు చేస్తోంది. కొత్త స్కీమ్ అగ్నిపథ్ కింద యువకులు నాలుగు సంవత్సరాల పాటు దళాలలో చేరి దేశానికి సేవ చేస్తారు. నాలుగు సంవత్సరాల ముగింపులో దాదాపు 80 శాతం మంది సైనికులు విధుల నుంచి వైదొలుగుతారు. 
 
వారు తదుపరి ఉపాధి మార్గాల కోసం సాయుధ దళాలు సహాయం అందిస్తాయి. రిక్రూట్ అయిన యువతలో అత్యుత్తమమైన వారు ఖాళీలు అందుబాటులో ఉన్నట్లయితే, వారి సేవలను కొనసాగించే అవకాశాన్ని పొందవచ్చు.