
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే సంకీర్ణ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు గాను ఒకరోజు బెయిల్ ఇవ్వాలని మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌లు చేసిన విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రత్యేక కోర్టు.. బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం ప్రకారం వేర్వేరు కేసుల్లో ఈ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి దేశ్‌ముఖ్ ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో ఉండగా.. కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్ మాత్రం అనారోగ్యకారణంతో ఆస్పత్రిలో చేరారు.
అయితే ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాలని, ఒక్కరోజు ఎస్కార్ట్‌తో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూర్ చేయాలని ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. బుధవారం ఈ పిటిషన్‌కు సంబంధించి సుదీర్థ వాదనలు జరిగాయి.
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. జైల్లో ఉన్న వాళ్లకు ఓటు వేసే హక్కు ఉండదని వాదించారు ఈడీ తరపు న్యాయవాదులు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్‌ఎస్ రోకడే.. బెయిల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వీరిద్దరూ ఓట్లు వేసేందుకు అవకాశం కోల్పోయారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా కీలకం కావడం గమనార్హం.
మహారాష్ట్రలోని ఆరు రాజ్యసభ స్థానాలకు గాను ఆయా పార్టీలు ఏడుగురు అభ్యర్థులను ప్రకటించాయి. రెండు దశాబ్దాల అనంతరం మహారాష్ట్రలో మొదటిసారి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. శివసేన ఇద్దరు అభ్యర్థులు సంజయ్ రౌత్, సంజయ్ పవార్‌లను ప్రకటించగా, సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఎన్‌సిపి, కాంగ్రెస్‌లు చెరొక అభ్యర్థి ప్రఫుల్ పటేల్, ఇమ్రాన్ ప్రతాప్ ఘర్హిలను ప్రకటించాయి.
ప్రతిపక్షమైన బిజెపి ముగ్గురు అభ్యర్థులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహదిక్‌లను ప్రకటించింది. ప్రతి అభ్యర్థి రాజ్యసభ స్థానానికి ఎన్నిక కావాలంటే 42 ఓట్లు కావాల్సి వుంది.
అయితే, శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపిలు ఒక్కోస్థానంలో గెలిచేందుకు కావాల్సిన ఎమ్మెల్యేల బలం ఉంది. 106 సభ్యులున్న బిజెపి కూడా కూడా రెండు స్థానాలు తేలికగా గెలువ గలదు. ఆరో స్థానంలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ నెలకొననుంది.
ఈ సమయంలో ఎన్‌సిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అవకాశం లభించకపోవడం మహావికాస్ అఘాడీకి సమస్యగా మారింది. చిన్న పార్టీలు, స్వంతత్ర అభ్యర్థులకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు.
మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్.. మంత్రిగా ఉన్న సమయంలో వివిధ పబ్‌ల నుంచి పోలీసుల ద్వారా నాలుగున్నర కోట్ల రూపాయలు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగానూ నవంబర్ 2021లో ఆయన అరెస్ట్ అయ్యారు. అలాగే మహారాష్ట్ర మైనార్టీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన మనీల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల మేరకు ఈడీ ఆయన్ని అరెస్ట్ చేసింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు