సీడీఎస్ అర్హతలను సడలించిన కేంద్రం

భారత సాయుధ దళాల ఉమ్మడి అధిపతి చీఫ్ అఫ్ డిఫెన్సె స్టాఫ్ (సీడీఎస్) నియామకానికి అధికారుల అర్హతల పరిధిని సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 62 ఏళ్ల వయసులోపు సర్వీసులో కొనసాగుతున్న లేదా రిటైర్ అయిన లెఫ్టనెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్‌‌లు కూడా సీడీఎస్ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా అర్హులను చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

ఈ మార్పులతో త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ద్వితీయ అత్యున్నత స్థాయి ర్యాంకు (క్రియాశీల) ఆఫీసర్లు కూడా తమ సీనియర్ అధికారులైన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ చీఫ్‌ల సమానంగా సీడీఎస్ పోస్టు అర్హత కలిగివుండనున్నారు. ఈ మార్పులతో సీడీఎస్ అర్హుల సంఖ్య పెరిగినట్టయింది.

సీడీఎస్ అర్హత సడలింపులకు సంబంధించిన మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఇటివలే రిటైర్ అయిన సర్వీస్ చీఫ్స్, వైస్ చీఫ్స్‌ కూడా అర్హత కలిగివుంటారు. పరిస్థితుల ఆధారంగా అవసరమైతే సీడీఎస్ సర్వీస్ రిటైర్మెంట్ వయసు గరిష్ఠంగా 65 సంవత్సరాలకు కూడా పెంచే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

సీడీఎస్ నియామక అర్హత మార్పులకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ యాక్ట్, ఆర్మీ యాక్ట్, నేవీ యాక్ట్‌ల ప్రకారం కేంద్ర ప్రభుత్వం సోమవారం వేర్వేరుగా 3 నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ప్రకారం ఎయిర్ మార్షల్ లేదా ఎయిర్ చీఫ్ మార్షల్ లేదా ఈ హోదాలతో రిటైర్ అయిన అధికారుల వయసు 62 ఏళ్లు మించకపోతే సీడీఎస్ పోస్టుకు ఎంపిక చేయవచ్చు అని కేంద్రం వివరించింది. ఇదే తరహాలో ఆర్మీ యాక్ట్ 1950, నేవీ యాక్ట్ 1957 కింద కూడా నోటిఫికేషన్లు విడుదల చేసింది.

ఈ మార్పులతో జనరల్ బిపిన్ రావత్ తర్వాత భారత్‌కు రెండవ సీడీఎస్‌ను ఎంపిక జరగనుంది. గతేడాది డిసెంబర్ 8న జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మిలిటరీ హెలికాఫ్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. హెలికాఫ్టర్‌లో ఉన్న మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సీడీఎస్ పోస్టును ప్రభుత్వం భర్తీ చేయలేదు.

బిపిన్ రావత్ భారత తొలి సీడీఎస్‌గా నియమితులైన విషయం తెలిసిందే. సీడీఎస్ రక్షణశాఖలో మిలిటరీ అఫైర్స్ విభాగం కార్యకలాపాలను నిర్వహిస్తారు. త్రివిధ దళాల సమన్వయకర్తగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారు.