హిజాజ్ ధరించిన ఆరుగురు విద్యార్దునులు సస్పెన్షన్ 

హిజాబ్‌ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దక్షిణ కన్నడ తీరప్రాంతంలోని ఓ కళాశాలలో హిజాబ్‌ ధరించిన ఆరుగురు విద్యార్థినులను యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. పలుమార్లు హెచ్చరించామని.. అయినా విద్యార్థినులు పట్టించుకోలేదని యాజమాన్యం ఆరోపిస్తోంది.
ఈ అంశంపై ప్రిన్సిపల్‌ అధ్యాపకులతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. జూన్‌1న ఉప్పినంగడిలోని ప్రభుత్వ ప్రథమ శ్రేణి కళాశాలలోని ఆరుగురువిద్యార్థినులను వారం రోజుల పాటు సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ, హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. వారు తరగతి గదిలో హిజాబ్‌ ధరించారని అధ్యాపకులు పేర్కొన్నారు.
సస్పెన్షన్‌ తరువాత గురువారం మరికొంతమంది విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చారని, దీంతో మరో బృందం కాషాయ కండువాలతో ఆందోళనకు దిగారు. హిజాబ్‌ ధరించిన విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించవద్దంటూ డిమాండ్‌ చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించుకున్నారు.
ఈ ఘటన అనంతరం హిజాబ్‌ ధరించిన విద్యార్థులను, కాషాయ కండువాలు ధరించిన వారిని తరగతుల్లోకి అనుమతించమంటూ యాజమాన్యం స్పష్టం చేసిదని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే ఈ వివాదాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన ఇద్దరు జర్నలిస్టులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. వారిని నిర్బంధించడంతో పాటు కెమెరాలను లాక్కెళ్లారని, ఫుటేజీని తొలగించారని అధికారులు తెలిపారు. 
 
ఆ దుండగులపై చర్యలు తీసుకోవాలని స్థానిక జర్నలిస్టుల అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. జిల్లా డిప్యూటీ కమిషనర్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌లకు మెమోరాండం సమర్పించింది. కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. 
 
గతవారం మంగుళూరు యూనివర్శిటీ కాలేజీలో మరోసారి హిజాబ్‌ వివాదం తెరపైకి వచ్చింది. సుమారు 15 మంది విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కాలేజీకి రావడంతో యాజమాన్యం కళాశాలలోకి అనుమతించలేదు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కాలేజీలకు వస్తున్నారంటూ యూనివర్శిటీ క్యాంపస్‌లో పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు.