అనంత్‌నాగ్‌లో హిజ్బుల్ కమాండర్ హతం

అనంత్‌నాగ్‌లో హిజ్బుల్ కమాండర్ హతం
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా రిషిపోరా గ్రామం కప్రాన్ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ఉల్-ముజాహిదీన్ టెర్రరిస్ట్ కమాండర్ నిసార్ ఖండే మరణించాడు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారు. ఉగ్రవాది నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌తో సహా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
రిషిపొరా గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం కార్డన్ సెర్చ్ ప్రారంభించారు.సెర్చింగ్ పార్టీ జాయింట్ టీమ్ అనుమానాస్పద స్థలాన్ని చుట్టుముట్టడంతో ఉగ్రవాదులకు,సెర్చింగ్ పార్టీకి మధ్య కాల్పులు ప్రారంభమైనాయి.
పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నారు. గాలింపులో ఇద్దరు ఉగ్రవాదుల ఆచూకీ లభించిందని, అయితే ఆపరేషన్ పూర్తయిన తర్వాత మృతుల సంఖ్య చెపుతామని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాదికి ఇది 56వ ఎన్‌కౌంటర్ఇం. తకుముందు జరిగిన ఆపరేషన్‌లలో 26 మంది పాకిస్థానీలతో సహా 89 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చడం గమనార్హం. 44 మంది యాక్టివ్ టెర్రరిస్టులను, వారి 184 మంది సహచరులను అరెస్టు చేశారు. మరోవంక, ఈ ఏడాది కశ్మీర్‌లో 17 మంది పౌరులు, 16 మంది భద్రతా సిబ్బంది కూడా ఉగ్రదాడి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.