ఎల్పీజీ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేత

ఎల్పీజీ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేత
గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. సబ్సిడీని కేవలం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేసింది. సాధారణ ప్రజానీకం ఇకపై మార్కెట్ ధరకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
 
ఈ విషయాన్ని కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గురువారం మీడియాకు వెల్లడించారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచీ ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ అందివ్వనున్నామని ఆయన తెలిపారు. 
 
ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1003 ఉండగా, ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ. 200 సబ్సిడీ అందించనున్నారు. ఆ మొత్తం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ పథకం కింద ఏడాదిలో 12 సిలిండర్లకు రూ. 200 చొప్పున సబ్సిడీ లభించనున్నది.
 
 సాధారణ గృహ వినియోగదారులు ఇకపై మార్కెట్ ధర ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందే. దేశ వ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల పథకం కింద లబ్ధిదారులు ఉన్నారు. అంటే మిగిలిన 21 కోట్ల మంది సబ్సిడీకి దూరమైనట్టే. 
 
2010లో పెట్రోలుపై సబ్సిడీని కేంద్రం ఎత్తివేయగా, 2014 నవంబర్‌లో డీజిల్ పైనా సబ్సిడీని తొలగించారు. అక్కడికి రెండేళ్లకు కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయగా తాజాగా గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీకి కేంద్రం మంగళం పాడేసింది. ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం రూపంలో ఊరట ఇచ్చిన కేంద్రం , గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపంలో భారం మోపింది.