సహకార సంఘాల సేకరణలను అనుమతించడం ద్వారా ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (జిఇఎం)ల పరిధిని విస్తరించాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం, కొనుగోలుదారులుగా సహకార సంఘాల నమోదు ప్రస్తుత జిఇఎంల పరిధిలోకి రాదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం బుధవారం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ సహకార సంఘాలు లబ్ధి పొందుతాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విలేకరులకు తెలిపారు.
ఇప్పుడున్న ఆదేశాల ప్రకారం, జిఇఎం పోర్టల్‌లో నమోదైన వస్తువులు, సేవలు ప్రైవేటు రంగ కొనుగోలుదారులు వినియోగించుకోవడానికి అందుబాటులో వుండవు. సరఫరాదారులు (సెల్లర్లు) మాత్రం ప్రభుత్వ లేదా ప్రైవేటు రెండు విభాగాల నుండీ వుండవచ్చు. ప్రభుత్వ కొనుగోలుదారుల కోసం బహిరంగ, పారదర్శక సేకరణా విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు 2016 ఆగస్టు 9న జిఇఎంను ప్రారంభించారు.
ప్రస్తుతం, అన్ని ప్రభుత్వ కొనుగోలుదారులు – కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, స్థానిక సంస్థలు – సేకరించడానికి ఈ వేదిక అనువుగా వుంది. సహకార సంఘాలను కొనుగోలుదారులుగా జిఇఎంల్లో నమోదు చేసుకోవడానికి అనుమతించడం వల్ల బహిరంగ, పారదర్శక క్రమం ద్వారా సహకార సంఘాలకు ప్రోత్సాహక ధరలు లభించడానికి అవకాశం ఉంటుంది.
జిఇఎం స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి)తో చర్చలు జరిపిన తర్వాత కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ జిఇఎం పోర్టల్‌లో వుండే నిర్ధారిత సహకార సంఘాల జాబితాను నిర్ణయిస్తుంది. మరింత పారదర్శకత, సమర్ధత, ప్రోత్సాహక ధరలను పొందేందుకు గానూ జిఇఎం వేదికను ఉపయోగించుకునేలా సహకార సంఘాలకు అవసరమైన సలహాలు, సూచనలను కేంద్ర సహకార శాఖ జారీ చేస్తుందని కేంద్రం పేర్కొంది.
కాగా, చత్తీస్‌గఢ్‌లో మూడు జిల్లాల సిఆర్‌పిఎఫ్ అభ్యర్థుల విద్యార్హతను సడలించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దక్షిణ చత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్, దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు గాను 400 మంది అభ్యర్థుల నియామకానికి ఈ సడలింపు వర్తింప చేయాలని నిర్ణయించింది.
అవసరమైన కనీస విద్యార్హతను 10వ తరగతి ఉత్తీర్ణత స్థాయి నుంచి 8వ తరగతికి సడలించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నియామకం కోసం ఉద్దేశించిన శారీరక ప్రమాణాల్లో కూడా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సముచిత సడలింపును ఇవ్వనుంది.

More Stories
హరియాణాలో ఓట్లు చోరీ.. రాహుల్ ఆరోపణలను కొట్టేసిన ఈసీ
మొహియుద్దీన్ నగర్‌ను మోహన్‌నగర్‌గా మారుస్తాం
బిహార్ ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలపై మరో వివాదం