
2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వైశ్రాయ్ హోటల్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. మళ్లీ 19 ఏండ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్నాయి. ఆ సమయంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది.
ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా జరిపే అవకాశం ఉంది. నోవాటెల్ హోటల్ (హైటెక్స్ సమీపంలోని)లో కార్యవర్గ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశ స్థలం, జాతీయ కార్యవర్గ సభ్యులకు బస కల్పించే నోవాటెల్, ఇతర హోటళ్లు, ప్రధాని బస నిమిత్తం రాజ్‌భవన్, తదితర ప్రదేశాలను పార్టీ జాతీయ నేతలు బుధవారం సందర్శించారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు జరపవలసిన ఏర్పాట్ల గురించి పార్టీ రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులతో చర్చించారు.
బుధవారం రాత్రి రాజ్‌భవన్‌ను సైతం సందర్శించిన తరుణ్ చుగ్, సంతోష్ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లో బస చేయనుండగా కేంద్ర మంత్రులు వివిధ స్టార్ హోటళ్లలో విడిది చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు 500 దాకా గదులను ముందస్తుగా బుక్ చేసినట్టు సమాచారం.
పెద్ద సంఖ్యలో జాతీయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా హాజరు కానుండటంతో వారికి విడిగా మీడియా సెంటర్, హోటళ్లలో బస తదితర ఏర్పాట్లలో రాష్ట్ర పార్టీ నిమగ్నమైంది. ఈ సంవత్సరం చివరిలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాన్ని సహితం ఈ సమావేశాలలో వెల్లడించి, ఆ దిశలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీ ఒక్కసారి కూడా గెలుపొందని 140 లోక్ సభ సీట్లపై, ఇంతవరకు బిజెపి అధికారంలోకి రాలేని దక్షిణాది- తూర్పున ఉన్న రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఆ దిశలో తెలంగాణకు బిజెపి జాతీయ నాయకత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నది.
పలు రాష్ట్రాలలో మంచి ఫలితాలు ఇచ్చిన `డబల్ ఇంజిన్’ విధానంను ప్రజల వద్దకు తీసుకెళ్లడం ద్వారా, కేంద్రం, రాష్ట్రాలలో ఒకే పార్టీ అధికారంలో ఉంటె జరుగబోయే ప్రయోజనాలను, వేగంగా అభివృద్ధి జరిగే అవకాశాలను ప్రజలకు వివరించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది.
మరోవంక, మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో గురువారం నిర్వహిస్తున్నది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిధిగా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సారధ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం