16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా భారతీయ యూజర్లు వినియోగిస్తున్న లక్షల సంఖ్యలో ఉన్న వాట్సాప్‌ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది.  కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న  వాట్సాప్‌   తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.
ఒక్క ఏప్రిల్‌ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.  అడ్వాన్స్‌డ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ సిస్టమ్‌ ద్వారా నిరంతరాయంగా ఇలా అపాయకర ఖాతాలను గుర్తించి, నిరోధించే ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ తెలిపింది.
 అనుమానిత అకౌంట్‌పై నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చినపుడు, ఇతరులు ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేసినపుడు ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.  ఇదిలా ఉండగా.. కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50లక్షలకుపైగా యూజర్లు కలిగిన డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు వాట్సాప్‌ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ తెలిపింది. అయితే, వాట్సాప్‌లో ఇతరులకు పంపే మెసేజ్‌లను మళ్లీ ఎడిట్‌/రీ–రైట్‌ చేసే ఆప్షన్‌ త్వరలో అందుబాటులోకి రావచ్చు. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది.